
ఓపెనర్లు జాకీర్ హాసన్ మరియు శాంటోలు మొదటి బంతి నుండి ఆచితూచి ఆడుతూ బంగ్లాకు అద్బుతమయిన మొదటి వికెట్ భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్ కు 124 పరుగులు జోడించడం విశేషం. అర్ద సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత శాంటో (64) పరుగుల వద్ద ఉండగా ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత జాకిర్ తో కలిసిన యాసిర్ అలీ మరియు లిటన్ దాస్ లు ఎక్కువ సేపు అతనికి సహకారం అందించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు. యాసిర్ అలీ కేవలం 5 పరుగులకే అక్షర్ పటేల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఇక లిటన్ దాస్ కూడా 19 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఉమేష్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఒకవైపు వికెట్లు కోల్పోతున్నా తన కెరీర్ లో మొదటి టెస్ట్ ను ఆడుతున్న ఓపెనర్ జాకీర్ హాసన్ తనపాటికి పరుగు పరుగు జత చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ దశలో జాకీర్ హాసన్ కెరీర్ లో ఆడుతున్న మొదటి టెస్ట్ లోనే ఇండియాపై సెంచరీ సాధించాడు. జాకీర్ హాసన్ 224 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్ లో కోహ్లీ కి క్యాచ్ ఇచ్చి ఘనంగా పెవిలియన్ చేరాడు. బంగ్లా తరపున ఆరంభ టెస్ట్ లో సెంచరీ చేసిన వారిలో జాకీర్ హాసన్ నాలుగవ ఆటగాడిగా నిలిచి రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం బంగ్లా జట్టు 280 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది.