ఇటీవల ఒడిషా అడవుల్లో ఒక పెద్ద ఏనుగు చనిపోయింది. తన తల్లి చనిపోయినందుకు దాని పిల్ల ఏనుగు ఎంతో బాధపడుతోంది. తల్లి శరీరం పక్కనే రోజంతా నిలబడి గుండెలవిసేలా రోదిస్తోంది. ఆ చిన్న ఏనుగు గంటల తరబడి తన తల్లి శరీరం పక్కనే నిలబడి, దానిని మళ్లీ బ్రతికించాలని ప్రయత్నిస్తూ ఉంది. తన తల్లిని లేపడానికి చాలా కష్టపడుతున్న ఏనుగును చూసి నెటిజన్లు బాధపడుతున్నారు.
ఈ ఏనుగుల ఫొటోలను IFS అధికారి సుశాంత నంద ఎక్స్‌లో షేర్ చేశారు. "ఒక ఏనుగు గుంపులోని ఒక యువ ఏనుగు, తన తల్లి (గుంపు నాయకురాలు) చనిపోయినందుకు చాలా బాధపడుతోంది. ఆ తల్లి ఏనుగు వృద్ధాప్యంతో కన్నుమూసింది. ఆ సబ్-అడల్ట్ ఎలిఫెంట్ తన తల్లిని లేపడానికి ప్రయత్నిస్తూ దాదాపు ఒక రోజు అదే చోట ఉండిపోయింది. ఉత్తర ఒడిశా అడవుల్లో ఈ సంఘటన జరిగింది" అని సుశాంత నంద తన పోస్ట్‌లో రాశారు. "ఏనుగులు మానవుల మాదిరిగానే ఎమోషన్స్ కలిగి ఉంటాయి. అవి కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని ఏర్పరుచుకుంటాయి." అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఈ సంఘటన గురించి అటవీ శాఖ అధికారులు తెలుసుకున్నారు ఆ ప్రదేశానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించారు. వారితో పాటు ఏనుగులను అదుపు చేసే బృందం, జంతు వైద్యుడు కూడా అక్కడికి వెళ్లారు.ఏనుగు ఎందుకు చనిపోయిందో తెలుసుకోవడానికి, ఒడిశా అటవీ శాఖ అధికారులు పోస్ట్‌మార్టం చేశారు. ఆ తర్వాత, ఆ పెద్ద ఆడ ఏనుగుది నేచురల్ డెత్ అని తెలుసుకున్నారు. ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత, ఆ ఏనుగు శవాన్ని అడవిలోనే పూడ్చేశారు. ఈ విషయాలను మీడియాకు తెలియజేస్తూ, ఆ రాష్ట్రంలోని ఈ విషయంపై ఇంకా దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.