
మూడేళ్ల వయసు లో బుడిబుడి అడుగులు వేస్తూ ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంతో మురిసి పోయారు తల్లిదండ్రులు. కానీ అంతలోనే వారికి కడుపుకోత మిగులుతుంది అని మాత్రం ఊహించలేకపోయారు. ఇంటి గడప దాటుతున్న సమయంలో అతనికి గడప తగిలి ఒకసారిగా పడిపోయాడు. అయితే పక్కనే ఉన్న కత్తి అతని మెడకు గుచ్చుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు లక్షలు ధారపోసి కుమారున్ని కాపాడుకున్నారు.
అయితే గాయం పూర్తిగా మానక ముందే మరో దెబ్బ తగిలింది. ఇంటి మీదకు కోతులు వచ్చి వీరంగం చేయగా.. చివరికి బిల్డింగ్ పైన ఉన్న ఒక బండరాయి కింద పడింది. అదే సమయంలో అక్కడ బాలుడు ఉండడంతో అతని తల మీద బండ రాయి పడింది. దీంతో తీవ్ర గాయాలు పాలైన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే కళ్ళ ఎదుటే కుమారుడు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు తల్లిదండ్రులు. గుండెలవిసేలా రోదించారు అని చెప్పాలి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరులో వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు అరణ్య రోదనగా విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. తమ గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రామస్తులు.