
అయితే స్వచ్చంధ సేవ కోసం తీసుకున్న భూముల్లో ఇతర కార్యక్రమాలు చేపడితే.. అది నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్టు పేరిట అదే జరుగుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతే కాదు.. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట ఉన్న పార్టీ ఆఫీసులన్నీ బాబు కుటుంబం ఆధీనంలోనే ఉన్నాయని సాక్షాత్తూ వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్టు లీజుకు తీసుకున్న స్థలాల్లో, ఆక్రమించుకున్న భూముల్లో అనేక భారీ భవనాలు నిర్మించారని.. ఈ భారీ భవనాలు వేటికీ సరైన అనుమతులు లేవని విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా ఆరోపించారు.
ఎన్టీఆర్ ట్రస్టు భవన్ పేరిట ఉన్న భూముల్లోని భవనాల విలువ వందల కోట్లలో ఉంటుందని.. దర్యాప్తు జరిపిస్తే బండారం మొత్తం బయట పడుతుందని విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఇది నిజమే అని విజయసాయిరెడ్డి భావిస్తే.. కేవలం ట్వీట్ చేసి వదిలిపెట్టకుండా న్యాయపోరాటం చేయాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ భూమలు ప్రధానంగా హైదరాబాద్‌లో ఉన్నాయి. ఇప్పుడంటే కళ కోల్పోయింది కానీ.. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఓ వెలుగు వెలిగింది.
టీడీపీ ప్రధాన కార్యాలయం కొలువు తీరింది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లోనే కదా. మరి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ భూములు, అక్రమ భవనాల విషయంలో చర్యలు తీసుకోవాలని వైసీపీ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోరుతుందా.. లేక ట్వీట్లతోనే వ్యవహరం వదిలేస్తుందా.. సరే.. తెలంగాణ విషయం వదిలేద్దాం.. ఏపీలోనూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు భూములు, భవనాలు ఉంటాయి కదా. మరి వాటిపై జగన్ సర్కారు విచారణ జరిపిస్తుందా.. చూడాలి.. ఏం జరుగుతుందో..?