నిన్న మొన్నటి వరకూ సిరిసిల్ల కలెక్టర్‌గా పని చేసిన మాజీ ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డికి సీఎం కేసీఆర్ పిలిచి మరీ ఎమ్మెల్సీ టిక్కెట్ కట్టబెట్టారు. అది కూడా ఎమ్మెల్యే కోటా టిక్కెట్ కావడంతో ఆయన ఎమ్మెల్సీ కావడం పక్కా.. అంతే కాదు.. ఆయనకు మంత్రి పదవి కూడా దక్కవచ్చని ప్రచారం సాగుతోంది. అయితే.. ఇప్పుడు వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్ పరువు పోగొట్టుకుంటున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఎందుకంటే.. కలెక్టర్‌గా పని చేసిన వెంకట్రామిరెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. వెంకట్రామిరెడ్డిపై అవినీతి, ఆరోపణలు ఉన్నాయని ఆయన నామినేషన్‌ను తిరస్కరించాలని ఎన్నికల సంఘానికి ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది. వెంకట్రామిరెడ్డి తనపై ఉన్న కేసుల వివరాలను  నామినేషన్ పత్రాల్లో ఈ వివరాలు పొందుపర్చలేదని కాంగ్రెస్ వాదిస్తోంది. అందుకే ఆయన దరఖాస్తును  ఆన్‌లైన్‌లో బహిర్గతం చేయాలని కోరుతోంది.


అంతే కాదు.. వెంకట్రామిరెడ్డి ఐఏఎస్‌ ఆఫీసర్.. ఆయన రాజీనామాను డీవోపీటీ ఆమోదించిన తర్వాతే అది చెల్లుబాటు అవుతుందని కాంగ్రెస్ వాదిస్తోంది. రాజీనామాను డీవోపీటీ   ఆమోదించిన తర్వాత నామినేషన్ వేయాల్సి ఉన్నప్పటికీ దాన్ని సీఎస్ ఎలా ఆమోదిస్తారో చెప్పాలని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌గోయల్‌ను కలిసి దీనిపై ఫిర్యాదు చేశారు.


వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను తిరస్కరించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అంతే కాదు.. వెంకట్రామిరెడ్డిపై రాష్ట్రపతి, డీవోపీటీ వద్ద కూడా అనేక ఫిర్యాదులు ఉన్నాయని కాంగ్రెస్ చెబుతోంది. ఈ వివరాలతో వెంకట్రామిరెడ్డి తన నామినేషన్‌ పత్రాల్లో పేర్కొనలేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారి రాజీనామాను ఒక్కరోజులోనే ఆమోదించడం ఏంటని ప్రశ్నిస్తోంది. మరి ఇందులో ఏదైనా తిరకాసు వస్తే.. మాత్రం అది కేసీఆర్ సర్కారు తలవంపులుగా మారే అవకాశం ఉంది. చూడాలి.. ఏం జరుగుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: