ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. పాలన బాగాలేకపోతే ప్రజలు ఓటుతో తిరస్కరిస్తారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ వంటి నేతలను సైతం ఒంటెత్తుపోకడలు పోతే జనం తిప్పికొట్టారు.  అయితే.. ఎందుకు ఓడాం.. తప్పెక్కడ జరిగింది అన్న విశ్లేషణ, ఆత్మ పరిశోధన నేతలకు అవసరం. అది జరిగినప్పుడే తప్పొప్పులు తెలుస్తాయి. ఆ తప్పులు దిద్దుకుని సరైన బాటలో నడిస్తే.. మళ్లీ జనం ఆదరిస్తారు. అలా కాకుండా తాము చేసిందే రైటు.. పిచ్చి ప్రజల నిర్ణయమే తప్పు అంటూ కొత్త విశ్లేషణలు చేస్తే ఎలా ఉంటుంది..?


అచ్చం చంద్రబాబు తాజా ఆలోచనల్లాగానే ఉంటుంది. ఎందుకంటే.. గతంలో తమ ఓటములకు చంద్రబాబు ఇప్పుడు కొత్త భాష్యం చెబుతున్నారు.. అధికారంలో ఉన్నప్పుడు పరిపాలన మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్లే పార్టీ రెండు సార్లు నష్టపోయిందని చంద్రబాబు చెబుతున్నారు. అంటే పాలనపై ఎక్కువ దృష్టి పెట్టి  పార్టీని పట్టించుకోలేదట.. అందువల్ల జనం తమను ఓడించారట. పరిపాలనపై బాగా దృష్టి పెడితే..ప్రజలకు మేలు జరుగుతుంది కదా. మరి ప్రజలకు మేలు జరిగితే ఆటోమేటిగ్గా ఓట్లు వేస్తారు కదా. మరి ఓట్లు వేస్తే.. పార్టీ గెలుస్తుంది కదా.


కానీ.. చంద్రబాబు లాజిక్ ప్రకారం.. పరిపాలనపై ఎక్కువగా దృష్టి పెడితే పార్టీ ఓడిపోతుందట. మరి ఇదేం లాజిక్కో ఒక పట్టాన ఎవరికీ అర్థం కావడం లేదు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలనే తపనతో వ్యక్తిగతంగా తాను ఎంతో నష్టపోయానని కూడా చంద్రబాబు చెబుతున్నారు. సంక్షేమ పథకాలకు ఆద్యం తెలుగుదేశం పార్టీనే అని... మళ్లీ అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం ఇస్తామని కూడా చెబుతున్నారు.


గతం కంటే రెట్టింపు సంక్షేమం ఇవ్వాలన్న ఆలోచన మంచిదే. కానీ ఇప్పుడు అదే పని చేస్తున్న జగన్‌ను మరి చంద్రబాబు ఎందుకు తప్పుబడుతున్నారు. జగన్‌ను తప్పుబడుతూ మళ్లీ అదే పని తాము చేస్తామని ఎందుకు చెబుతున్నారు. తాము కూడా అదే పని చేస్తామంటే.. ఇప్పుడు సంక్షేమం అందిస్తున్న జగన్‌ను ప్రజలు ఎందుకు ఓడించాలి.. ఈ ప్రశ్నలకు మాత్రం చంద్రబాబు దగ్గర సమాధానాలు కనిపించడం లేదు. ఏదేమైనా సరే.. జగన్‌ను జనం ఓడించాల్సిందే.. తమను గెలిపించాల్సిందే. ఇదీ చంద్రబాబు ఆశ, ఆకాంక్ష. మరి జనం ఏంచేస్తారో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: