ప్రత్యేక హోదా.. ఆంధ్రప్రదేశ్ వాసుల కల. ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోతున్న సమయంలో ఏకంగా పార్లమెంటులోనే సాక్షాత్తూ ఆనాటి ప్రధాన మంత్రి ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ.. ఆ హామీ ఇంకా నెరవేరలేదు. అంతే కాదు..ఇక దాన్ని మర్చిపోవాలని కేంద్రం చెబుతోంది. దీనికితోడు మోడీ సర్కారుకు ఫుల్ మెజారిటీ ఉండటంతో ఏపీ సీఎం జగన్ ఫలితాలు వచ్చిన రోజే ప్రత్యేక హోదా పోరాటంపై చేతులెత్తేశారు.


ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓ చిన్న చిన్న ఆశ ప్రత్యేక హోదాపై కనిపిస్తోంది. వచ్చే సాధారణ ఎన్నికలలో  కేంద్రంలో ప్రతిపక్ష పార్టీల కూటమి అధికారంలోకి వస్తే వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అంటున్నారు. బీహార్ తో పాటు వెనకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హామీ ఇస్తున్నారు. వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదంటున్న నితీశ్ కుమార్.. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండడానికి... ఎలాంటి కారణాలు కనిపించడం లేదన్నారు.


ఉమ్మడి బీహార్‌ నుంచి ఝార్ఖండ్  వేరే రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి.. బీహార్  ఆర్థికంగా చాలా నష్ట పోయిందని నితీశ్ కుమార్ అన్నారు. బీహార్‌ ఖనిజ సంపదను కోల్పోయిందని నితీశ్ కుమార్ తెలిపారు. ఎన్డీయే నుంచి బయటకొచ్చి బీహార్ లో విపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్.. దేశంలో ప్రతిపక్ష  పార్టీల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీతో సుదీర్ఘ కాలం కలిసి ఉండి తప్పుచేశానంటున్న నితీశ్ కుమార్.. ఆ పార్టీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతుండడం వల్లే బయటకు రావాల్సి వచ్చిందన్నారు.


మరి నితీశ్ కుమార్ చెప్పినట్టు వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా రావాలంటే.. ప్రతిపక్షాల కూటమి కేంద్రంలో అధికారంలోకి రావాలి.. ప్రస్తుతం ఉన్న బీజేపీ సర్కారు ఓడిపోవాలి.. కానీ అది జరిగే పనేనా.. విపక్షాలు ఇంకా ఐక్యతే సాధించలేదు. ఎవరికి వారే అన్నట్టుగా ఉన్న ప్రతిపక్షాలు ఏకమై బీజేపీ సర్కారును పడగొట్టగలవా.. ఏమో.. ప్రస్తుతానికి ఇది అసాధ్యంగానే కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: