కాగ్.. ప్రభుత్వ లెక్కలన్నీ తేల్చే ప్రభుత్వ వ్యవస్థ.. అయితే.. ఈ కాగ్‌ ఎప్పుడూ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపిస్తుంది. అలాంటి ఓ వ్యవస్థ ఉండటం కూడా మంచిదే కదా. తాజాగా 2020 - 21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన కాగ్‌ రిపోర్టును ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ రిపోర్టు ప్రభుత్వం చేసిన తప్పులన్నీ బయటపెట్టింది. 2020-21లో ప్రభుత్వ రోజువారీ కార్యకలాపాల కోసం రిజర్వుబ్యాంకు నుంచి 1,04,539 కోట్ల రూపాయలు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సులు ప్రభుత్వం తెచ్చిందని కాగ్‌ రిపోర్టులో పేర్కొంది.


గతంతో పోలిస్తే ఇది 73.16 శాతం ఎక్కువట. 2020-21లో రాష్ట్రప్రభుత్వ నగదు నిల్వ 4202 కోట్ల మేర తగ్గాయట. ఇదే ఆర్ధిక సంవత్సరంలో ఏపీ 9,86,611 కోట్ల జీఎస్ డీపీ నమోదు చేసిందట.  కరోనా కారణంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రవృద్ధి రేటు 1.58 శాతమేనట. కోవిడ్ కారణంగా వ్యవసాయ రంగం మినహా అన్ని రంగాలూ దెబ్బతిన్నాయట. గతంతో పోలిస్తే రెవెన్యూ రాబడి, వసూళ్లు పెరిగాయట.


2020-21 ఆర్ధిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 33,230 కోట్లుగా నమోదయ్యిందట. ఆర్ధిక లోటు 52,857 కోట్లుగా నమోదయిందట. 2019-20 కాలానికి 176 శాతం మేర రుణ బకాయిలు పెరిగాయట. రెవెన్యూ వ్యయాన్ని అదుపులో ఉంచలేకపోవటం కేంద్రం గ్రాంట్లు ఇచ్చినా ప్రభుత్వ వైఫల్యం కారణంగా రెవెన్యూ లోటులో పెరుగుదల కొనసాగిందట. రాష్ట్రప్రభుత్వం తరపున వివిధ సంస్థలు 2021 మార్చి నాటికి 86,259 కోట్ల రూపాయలు రుణాలు పొందాయట.


2020-21 లో ఏపీ ఐదేళ్లలో అతితక్కువ స్థూల ఉత్పత్తి వృద్ధిరేటును నమోదు చేసిందట.  ఎఫ్ఆర్ బీఎం చట్టాన్ని సవరించినా ద్రవ్యలోటు , బకాయిల బాధ్యతల విషయంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు ప్రభుత్వం కట్టుబడి లేదట. తీసుకున్న అప్పులో ఎక్కువ భాగం రెవెన్యూ ఖాతాను భర్తీ చేసేందుకు వినియోగించటంతో రాష్ట్రంలో ఆస్తుల కల్పనపై ప్రభావం పడిందందట. ఇలా నివేదికలో చెప్పిన అంశాలన్నీ జగన్ సర్కారు చేసిన తప్పుల జాబితాగానే చెప్పుకోవచ్చు. జగన్ సర్కారు ఇప్పటికైనా వీటిపై దృష్టి పెట్టి సరిచేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: