ఎన్నికల సీజన్ ఇంకా ముగిసిపోలేదు. ఈ మధ్యే 5 రాష్ట్రాల్లో ఎన్నికల తంతు ముగిసింది. కానీ అసలైన సార్వత్రిక ఎన్నికలు మిగిలే ఉన్నాయి. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలకు అన్ని పార్టీలు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికలకు ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు సెమీ ఫైనల్స్ గా భావించారు.


కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొత్తం మూడు రాష్ట్రాల్లోనూ తమ ఖాతాలో వేసుకుంది. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో భారీ మోజార్టీ సాధించింది.  ఇక తర్వాతి ఎపిసోడ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.  అంత కన్నా ముందు ఎన్నికలకు ముందు సీఎం ఎవరో ప్రకటించే బీజేపీ ఈ సారి ఎందుకో కాస్త సమయం తీసుకుంది. ఫలితాలు విడుదలయ్యాక వారం రోజులకు గానీ మూడు రాష్ట్రాల సీఎంలను ప్రకటించలేదు.  వాస్తవానికి మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ లో వసుంధర రాజె, ఛత్తీస్ గఢ్ లో రమణ్ సింగ్ పోటీలో ఉన్నారు.


వీళ్ల ముగ్గురికే మరోసారి అవకాశం వస్తోందని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఈ మూడు రాష్ట్రాల్లో సోషల్ ఇంజినీరింగ్ పాటించింది. ఛత్తీస్ గఢ్ లో తొలి ఆదివాసీ, మధ్యప్రదేశ్ లో బీసీ, రాజస్థాన్ లో బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తులను సీఎంలుగా ప్రకటించింది. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ ఎంపిక చేపట్టింది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


అదే క్రమంలో కొత్త తరం నాయకుల్ని ముందుకు తీసుకెళ్తోందని అనిపిస్తోంది. వసుంధర రాజె, శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ ల తరానికి ముగింపు పలికి కొత్త తరం నాయకులకు అవకాశం కల్పించింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాదేవి, వెంకయ్య నాయుడు తరానికి బీజేపీ స్వస్తి పలికి కొత్త నాయకత్వాన్ని మోదీ, అమిత్ షా, నడ్డాలు ప్రోత్సహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: