రాజ్యసభ ఎన్నికల బరిలో తాము కూడా ఉన్నామని చెబుతోంది తెలుగుదేశం పార్టీ. సరిపడా ఎమ్మెల్యేలు లేకపోయినా అనూహ్యంగా ఏదైనా జరిగే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. ప్రధానంగా వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఆశలు పెట్టుకున్న టీడీపీ తమకు 50మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెబుతోంది. రాజ్య సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఏపీలో అధికార, ప్రతిపక్ష నేతలు ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు.


రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మొత్తం 175 ఎమ్మెల్యేల్లో ఇప్పటికే గంటా శ్రీనివాసరావు రాజీనామకు స్పీకర్ ఆమోదం తెలిపారు. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు.. వైసీపీ నుంచి టీడీపీకి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలత పాటు జనసేన నుంచి వైసీపీకి వెళ్లిన రాపాక వరప్రసాద్ పై అనర్హత వేటుకు సంబంధించిన అంశం నేడో రేపో తేలనుంది. ఈ పది మందిని పక్కన పెడితే మిగిలేది 165 మంది. ఈ సంఖ్య ప్రకారం ప్రాతిపాదికన తీసుకుంటే ఒక్కో రాజ్య సభ అభ్యర్థి విజయానికి 41మంది ఎమ్మెల్యేలు అవసరం అవుతారు.


అయితే గతంలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలో నిలిచిన పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. ఈ సందర్భంలో కూడా టీడీపీ తమకు 50మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. కానీ నలుగురు మాత్రమే టీడీపీకి ఓటేశారు. ఈ సారి కూడా వైసీపీలో సీట్లు దక్కని అసంతృప్తి ఎమ్మెల్యేల ఓట్లతో విజయం సాధించవచ్చని అంచనా వేస్తోంది.


టీడీపీ తరఫున సీనియర్ నేతలు వర్ల రామయ్య కానీ.. కోనేరు సురేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వర్ల రామయ్య దళిత నాయకుడు కావడంతో ఆ సానుభూతి పొందే ప్రయత్నం చేయాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు కోనేరు సురేశ్ ఆర్థికంగా బలవంతుడు కావడంతో దాదాపు 25మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఈయన పేరును ఎంపిక చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: