ఎన్నికలన్నాక పొత్తులు సహజం. పొటా పోటీ హామీలు ఇంకా సహజం. అయితే ఒకటికి మించి పార్టీలు కలిసి పోటీ చేస్తే కూటమి అంటారు. రెండు పార్టీలు కలిసి బరిలో దిగితే అది పొత్తు మాత్రమే. ఇప్పుడు చూస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు లేవు. ఏపీలో మాత్రం అసెంబ్లీకి, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి.


అయితే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీలు కలిసి కూటమిగా బరిలో దిగాయి. పదేళ్ల తర్వాత ఈ మూడు పార్టీలు కలిసి జట్టు కట్టాయి. 2014లోను టీడీపీ బీజేపీ కలిసే పోటీ చేశాయి. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీని స్థాపించినా.. పోటీ మాత్రం చేయలేదు. 2019 కి వచ్చే సరికి ఈ మూడు పార్టీల దారులు వేరయ్యాయి. టీడీపీకి ఘోర పరాజయం ఎదురైంది. బీజేపీన, జనసేన పార్టీలు చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయాయి. ఇక జనసేనాని రెండు చోట్ల ఓటమి చెందారు.


2009 నుంచి చూసుకుంటే ఉమ్డి ఏపీలో నాడు టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసి మహా కూటమిగా ఏర్పడ్డాయి. కానీ వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ చేతిలో ఆ కూటమికి పరాభవమే ఎదురైంది. 2014లో తెలంగాణ ఏర్పాటు అయ్యాక 2018లో టీఆర్ఎస్ ఒంటరిగా బరిలో దిగగా.. ముందస్తు ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించాలని కాంగ్రెస్, టీడీపీ, వామపక్షాలు, తెజస కలిపి మరోసారి మహా కూటమిగా ఏర్పడ్డాయి.


కానీ ఘోరంగా ఓడిపోయాయి. దీంతో ఈ ఎన్నికల్లో తెలంగాణ బరి నుంచి టీడీపీ తప్పుకుంది. ఇక చంద్రబాబు కూడా గతంలో వామపక్షాలు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూటమి అనే పదాన్ని వాడుకలోకి తేలేదు. గత 15 ఏళ్లుగా మాత్రమే కూటమి అనే పదాన్ని తీసుకొచ్చారు. ఈ వ్యవధిలో నాలుగు సార్లు ఎన్నికలు జరగ్గా 2009, 2018లో రెండు సార్లు ఓటమి ఎదురైంది. అంటే ఒక్కసారీ కూటమి నెగ్గలేదు. మరి ఈ సారైనా కూటమి గెలుస్తుందో.. లేక సెంటిమెంట్ రిపీట్ అవుతుంతో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: