
ఇక, సీపీఎం విషయానికి వస్తే.. ఆ పార్టీ 2019 తర్వాత.. వైసీపీకి అనుకూలంగా మారిందన్న చర్చ ఉంది. అప్పటి సీపీఎం కార్యదర్శి.. మధు.. జగన్‌కు దూరపు బంధువు కావడంతో ఆయన నోరు విప్పలేదు. తర్వాత.. ప్రభుత్వంలోనూ.. సీపీఎంకు మేలు జరిగేలా జగన్ నిర్ణయం తీసుకున్నారన్న చర్చ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాలకు భూములు ఇచ్చారన్న చర్చ జరిగింది. దీంతో సీపీఎం నాయకులు వైసీపీ విషయంలో ఒక్కటంటే ఒక్క ఉద్యమానికి కూడా ముందుకు రాలేదు. కీలకమైన స్మార్ట్ మీటర్ల వ్యవహారంలోనూ.. మౌనంగా ఉన్నారు.
కట్ చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం రావాలని కలలు కన్న సీపీఐతో పాటు.. సీపీఎం నేతలు కూడా ఇప్పుడు కూటమి సర్కారును ఏకేస్తున్నారు. స్మార్ట్ మీటర్ల నుంచి పెట్టుబడి దారులకు భూముల పంపిణీ వరకు, సంక్షేమ పథకాల నుంచి ఎమ్మెల్యేల తీరు వరకు కూడా కమ్యూనిస్టులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. స్మార్ట్ మీటర్లపై అయితే.. పెద్ద ఎత్తున ఉద్యమమే చేస్తున్నారు. కానీ, వాస్తవానికి స్మార్ట్ మీటర్ల వ్యవహారం.. వైసీపీ హయాంలో చేసుకున్న ఒప్పందం అనేది కమ్యూనిస్టులకు కూడా తెలుసు.
అయినప్పటికీ.. వైసీపీపై పన్నెత్తు మాట అనకుండా.. కూటమి నాయకులపై విరుచుకుపడుతున్నారు. కూటమి తప్పులను పెద్దవి చేసి చూపుతున్నారు. అంతేకాదు.. వైసీపీ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకుని ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే.. తెరచాటున ఏదో జరుగుతోందన్న చర్చ కూటమి నాయకుల్లో జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి పొత్తులు ఏమైనా పెట్టుకునే అవకాశం ఉందా?.. అనేది ప్రస్తుతం సందేహంగా మారింది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు కాబట్టి.. జగన్ తనకు అనుకూలంగా ఉండేందుకు కమ్యూనిస్టులను దువ్వుతున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.