వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రస్తుత పరిస్థితుల్లో రెండు గోల్డెన్ ఛాన్సులు ల‌భించాయి. ఒకటి పార్టీ పరంగా, రెండోది అసెంబ్లీ రూపంలో. ఈ రెండు అవకాశాలను ఎంతగా వినియోగించుకుంటారన్నది ఇప్పుడు వైసీపీ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఇందులో మొదటిగా ప్రజల మధ్యకువెళ్లే అవకాశం. ఎన్నికల త‌ర్వాత వైసీపీ కాస్త వెన‌క‌ప‌డింది. ఇదే టైంలో ప్రజల మధ్యకి వెళ్లి సమస్యలు విని, ప్రభుత్వ అనుస‌రించే ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై పోరాటం చేస్తే జగన్‌కి మళ్లీ బలమైన గుర్తింపు వస్తుందని పార్టీ సీనియర్ నేతలు భావిస్తున్నారు. ఈ విష‌యంలో ఆలస్యం చేయడం సరికాదని వారి వాదన. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో మంచి మార్కులు సంపాదిస్తోంది. ఇది మరింత పెరిగితే వైసీపీకి నష్టం తప్పదని వారు స్పష్టంగా చెబుతున్నారు.


ఈ నేప‌థ్యంలోనే జగన్ త్వరగా జనాల్లోకి వెళ్లి, ప్రభుత్వం లోపాలను ఎత్తిచూపుతూ, ప్రజలకు అండగా నిలబడాలి అన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. రెండోది అసెంబ్లీకి హాజరవడం. గత ఏడాదిన్నర కాలంలో జగన్ రెండు సార్లే సభకు హాజరయ్యారు. ఆ తర్వాత ఎక్కువ సమయం తాడేపల్లి ప్యాలెస్‌లోనే గడిపేశారు. సభకు రాకుండా ప్రెస్ మీట్లు పెట్టడం సరైన పద్ధతి కాదని సొంత పార్టీ నాయకులే అంటున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా సభకు రావాలని స్పష్టంగా కోరగా, రాకుండా ఉంటే ప్రశ్నలు అడిగినా అనుమతించేది లేదని హెచ్చరించారు. ఈ సందర్భంలో సభకు దూరంగా ఉండటం వైసీపీకి మైనస్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.


అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం తమ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేసుకోవాలని చూస్తోంది. చంద్రబాబు స్వయంగా సభను వేదికగా చేసుకుని తన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ సభకు దూరంగా ఉంటే, పార్టీ ప్రభావం తగ్గి డైలమాలో పడే అవకాశం ఉంది.మొత్తానికి, జగన్ ముందు రెండు మార్గాలు ఉన్నాయి.. ప్ర‌జల్లోకి వెళ్లి ప్రభుత్వంపై పోరాటం చేయడం, అలాగే సభలో ప్ర‌జా సమస్యలను ప్రస్తావించడం. ఇవి రెండూ చేయగలిగితేనే వైసీపీ మ‌ళ్లీ పుంజుకునే అవ‌కాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: