
ఇప్పటికే గవర్నర్ ప్రసంగానికి హాజరైన సందర్భం తప్పించి మిగతా సమయాల్లో అసెంబ్లీకి రాని వారు, కేవలం సంతకాలతో హాజరైనట్లు చూపించుకోవాలని ప్రయత్నించారు. అయితే స్పీకర్ ఆ సంతకాలు చెల్లవని స్పష్టం చేశారు. ఇక సెప్టెంబర్‌లో జరగబోయే వర్షాకాల సమావేశాలకు హాజరు కాకపోతే అరవై పని రోజుల గడువు పూర్తవుతుంది. దాంతో ఆటోమేటిక్‌గా అనర్హత వేటు పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఎమ్మెల్యేలుగా తొలిసారి గెలిచిన వారికి ఈ స్థాయిలో రిస్క్ తీసుకోవడం సులభం కాదు. అనర్హత వేటు పడితే ప్రజలకు ఎదురు చూడలేరు, తదుపరి ఎన్నికల్లో తిరిగి గెలిచే అవకాశం దాదాపు ఉండదు. అందువల్లే వారు అసెంబ్లీకి వెళ్లి కనీసం తమ ఉనికిని నిలబెట్టుకోవాలనుకుంటున్నారు.
వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు పెద్ద సందిగ్ధం నెలకొంది. ఎమ్మెల్యేలు హాజరైతే జగన్ ఇమేజ్‌కి నష్టం జరుగుతుంది. ఆయనను వేరుచేసి ఎమ్మెల్యేలంతా సభలోకి వెళితే, స్పీకర్ కూడా జగన్‌పై అనర్హత వేటు వేయడంలో వెనుకాడకపోవచ్చు. మరోవైపు, హాజరయ్యే ఎమ్మెల్యేలపై పార్టీ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ తమ రాజకీయ భవిష్యత్తు కోసం హాజరు కావడం తప్ప వేరే మార్గం లేదని కొందరు భావిస్తున్నారట. ఏదేమైనా జగన్ అసెంబ్లీకి వెళ్లకపోతే ప్రతిపక్ష నాయకుడి హోదా లేకపోవడమే కాకుండా, తన నాయకత్వంపై కూడా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఎమ్మెల్యేల పట్ల కూడా ప్రజల్లో నమ్మకం తగ్గే అవకాశం ఉంది. ఈ కారణాల వల్లే జగన్ చివరకు అసెంబ్లీకి రావచ్చని భావన కొందరిలో ఉంది. రాబోయే వర్షాకాల సమావేశాలు వైసీపీ భవిష్యత్తును నిర్ణయించే కీలక సమయంగా మారడం ఖాయం.