బంగారం... భారతీయ కుటుంబాలకు, ముఖ్యంగా మహిళలకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఒక అత్యంత విలువైన ఆస్తి. అందుకే పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు, ఆడపిల్లల తల్లిదండ్రులు బంగారం కొనుగోలు చేయడానికి తెగ తాపత్రయపడతారు. ప్రస్తుతం కార్తీకమాసం మొదలవడంతో, పెళ్లి సందడి మొదలైంది. ఈ సమయంలో బంగారం ధరలు నిత్యం ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడికి అందనంత దూరం పోతున్నాయి. అయితే, ఈ భయంకరమైన పెరుగుదల మధ్యలో కొనుగోలుదారులకు కాస్త ఊరటనిస్తూ... కేవలం రెండు రోజుల్లోనే ధరలు రూ.6,000 వరకు తగ్గడం కొంత ఉపశమనం కలిగించింది. అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి అంతర్జాతీయ ఉత్పత్తికి సంబంధం ఉందా? ప్రపంచ మార్కెట్‌లో అసలు ఈ పసిడికి రాజు ఎవరు?

బంగారపు ప్రపంచంలో డామినేషన్ ఎవరిది? .. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పసిడి పాత్ర ఎప్పుడూ కీలకమైనదే. దీని ధరను నిర్ణయించే అంశాలలో ఒకటి... ప్రపంచవ్యాప్తంగా దాని ఉత్పత్తి స్థాయి. అసలు మనకు ఇంత ముఖ్యమైన బంగారాన్ని ప్రపంచంలో అత్యధికంగా తవ్వి తీస్తున్న దేశాలు ఏవో తెలుసుకుంటే మీరు తప్పక ఆశ్చర్యపోతారు. ప్రపంచ బంగారం ఉత్పత్తిలో చైనా దేశం తిరుగులేని అగ్రస్థానంలో ఉంది. డ్రాగన్ కంట్రీ ఏకంగా 3,75,155 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తూ రికార్డు సృష్టిస్తోంది. ఈ స్థాయిలో ఉత్పత్తి చేసే మరో దేశం ప్రపంచంలో లేదు. అందుకే పసిడి ప్రపంచంలో చైనాదే పెత్తనం అని చెప్పవచ్చు. తర్వాతి స్థానాల్లో నువ్వా-నేనా పోటీ

చైనా తర్వాత రెండవ స్థానం కోసం పెద్ద పోటీ జరుగుతోంది. రష్యా (3,13,022 కిలోలు), ఆస్ట్రేలియా (2,96,053 కిలోలు) నువ్వా నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతూ ప్రపంచ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ మూడు దేశాల నుంచే ప్రపంచానికి అధిక శాతం బంగారం సరఫరా అవుతోంది. ఆ తర్వాత స్థానాలలో నిలబడిన దేశాలను చూస్తే, ఉత్తర అమెరికా నుంచి కెనడా (1,98,335 కిలోలు), యునైటెడ్ స్టేట్స్ (1,70,000 కిలోలు) వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి. ఇక ఆసియా నుంచి కజకిస్తాన్ (1,32,763 కిలోలు), ఆఫ్రికా ఖండం నుంచి ఘనా (1,25,549 కిలోలు) వంటి దేశాలు చెప్పుకోదగిన స్థాయిలో పసిడిని తవ్వి తీస్తున్నాయి. మెక్సికో, ఉజ్బెకిస్తాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాలు సైతం లక్షల కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్‌కు పంపుతున్నాయి.

ధరల హెచ్చుతగ్గులకు ఇదే కారణం .. బంగారం ధరలు పెరగడానికి అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితి, డాలర్‌తో రూపాయి మారకం విలువ, కీలక వడ్డీ రేట్ల నిర్ణయాలు కారణమైనప్పటికీ, ఈ అగ్రస్థానంలో ఉన్న దేశాల నుంచి సరఫరా హెచ్చుతగ్గులు సైతం ధరల మీద నేరుగా ప్రభావం చూపిస్తాయి. ప్రపంచంలోని ఈ ముఖ్యమైన ఉత్పత్తి కేంద్రాల నుండి వచ్చే ప్రతి చిన్న వార్త కూడా మన దేశంలో మహిళలు కొనుగోలు చేయాలనుకునే ప్రతి గ్రాము బంగారం ధరపై తీవ్ర ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోవాలి. కాబట్టి పసిడి ధరలు కొనుగోలు చేయాలంటే, కేవలం మన దేశ ఆర్థిక పరిస్థితులు మాత్రమే కాదు, ఈ అంతర్జాతీయ గోల్డ్ ప్రొడ్యూసర్స్ ఉత్పత్తిపై కూడా ఓ కన్ను వేసి ఉంచాల్సిందే!

మరింత సమాచారం తెలుసుకోండి: