1950 నుంచి తెలుగు, తమిళం, హిందీ, మళయాళం..ఇలా భాషా భేదం లేకుండా కొన్ని క్లాసిక్ సాంగ్స్ కి ఎప్పటికి విపరీతమైన ఫ్యాన్సుంటారు. ఆ సాంగ్స్ వినిపిస్తే చేసే పనులు మానుకొని మరీ కాసేపు చెవి, మనసు అక్కడ వదిలేస్తారు. అలాంటి ఎవర్ గ్రీన్ సాంగ్స్ మన తెలుగులో లెక్కకు మించి ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అందుకే కొన్ని చార్ట్ బస్టర్ సాంగ్స్ ని రీమిక్స్ చేయాలంటే మన దర్శకనిర్మాతలే కాదు హీరోలు కూడా చాలా భయపడుతుంటారు. ఎక్కడ ఏ తేడా వచ్చినా ఫ్యాన్స్ ఆడేసుకుంటారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ తో తాట తీస్తున్నారు. ఒక రీమిక్స్ సాంగ్ ని ఎంత బాగా తీసినా ఏవేవో వంకలు పెట్టే పరిస్థితి ప్రస్తుతం జనాల్లో ఉందన్న విషయం ఈ పాటికే అందరికి అర్థమయ్యో ఉంటుంది. అందుకే ఇది కత్తి మీద సవాల్ లాంటిది. 

 

అయినా మన దర్శకులు రీమిక్స్ పాటలపై ఎందుకనో మోజు పడుతూ ఎప్పటికప్పుడు క్లాసిక్ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ని రీమిక్స్ చేస్తూనే ఉన్నారు. విమర్శలు ఎదురైనా ఈ పంథాని మార్చుకొని వదిలిపెట్టడం లేదు. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ .. వాల్మీకి (గద్దల కొండ గణేష్) సినిమాల్లో రీమిక్స్ పాటలు వచ్చాయి. వాటిపైనా దారుణంగా విమర్శలు వచ్చాయన్న విషయం తెలిసిందే. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్- కీర్తి రెడ్డి జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ తొలి ప్రేమ. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే క్లాసిక్ ని తీసుకుని రీమిక్స్ చేశారు. ఈ మనసే..  అంటూ సాగే ఫీల్ గుడ్ సాంగ్ ని రీమిక్స్ చేశారు. ఉదయ్ శంకర్ - ఐశ్వర్యా రాజేష్ జంటగా నటించిన 'మిస్ మ్యాచ్' సినిమాలో ఈ రీమిక్స్ ని తెలుగు ప్రేక్షకులు త్వరలోనే చూడబోతున్నారు. 

 

ఇక గానగంధర్వుడు ఎస్పీబీ ఆలపించిన ఆ క్లాసిక్ గీతాన్ని ఇప్పుడు నవతరం గాయకుడు రేవంత్ ఆలపించగా .. గిఫ్టాన్ ఇలియాస్ సంగీతం అందించారు. ఇక ఈ పాటలో ఫ్లేవర్ పూర్తిగా మారిపోవడంతో సాంగ్ ని పూర్తిగా చెడగొట్టేశారన్న విమర్శలు మొదలైయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో చూడాలి. ఈ ప్రయత్నం కేవలం పవన్ ఫ్యాన్స్ ని మెప్పించాలనే ఆలోచనతో చేసినా అది మిస్ మ్యాచ్ అవడంతో ఇప్పుడు చిత్ర యూనిట్ ఎలా తట్టుకోవాలి అని భయపడుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: