కరోనా సెలవుల్ని మెగా ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చిరంజీవి సోషల్ మీడియాలోకి అడుగుపెట్టడంతో ఖుషీఖుషీగా ఉన్నారు అభిమానులు. రోజూ ఏదో ఒక అప్ డేట్ తో టైమ్ పాస్ చేస్తున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి, కె.రాఘవేంద్రరావు మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. ఘరానామొగుడు రిలీజ్ అయి 28 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒకరిని మరొకరు అభినందించుకున్నారు. 

 

చిరంజీవి ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఆలస్యం.. దూకుడు చూపిస్తున్నాడు. చిరంజీవి, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందిన ఘరానామొగుడు 1992 ఏప్రిల్ 9న రిలీజ్ అయింది. సినిమా వచ్చి 28 సంవత్సరాలు కావడంతో.. దర్శకేంద్రుడు చిరంజీవితో ఉన్న వర్కింగ్ స్టిల్ పోస్ట్ చేశాడు. కాలం వేగంగా గడిచిపోతున్నప్పటికీ బాబాయ్ తో కలిసి షూటింగ్ జరుపుకున్న రోజులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అంటూ ట్వీట్ చేశాడు రాఘవేంద్రరావు. ఇదొక మెగా స్పెషల్ ఫిల్మ్ అని ఘరానామొగుడు జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు రాఘవేంద్రరావు. 

 

రాఘవేంద్రరావు ట్వీట్ కు చిరంజీవి రిప్లై ఇచ్చారు. ఘరానామొగుడు సృష్టించిన ఘనత మీదే అంటూ క్రెడిట్ రాఘవేంద్రరావుకు ఇచ్చేశారు చిరంజీవి. ఈ చిత్రం సృష్టించిన రికార్డుల కంటే మీతో పనిచేసిన ప్రతీరోజు మంచి జ్ఞాపకమన్నారు. నటీనటులను పువ్వుల్లో.. ఒక్కోసారి పండ్లల్లో పెట్టి చూసుకుంటూ మంచి ఫలితాన్ని రాబట్టుకున్న ఘరానా దర్శకుడు తమరంటూ చమత్కరించారు చిరంజీవి. కీరవాణి, నిర్మాత దేవీ వరప్రసాద్ ఈ విజయానికి మూల స్తంభాలని పేర్కొన్నారు. 

 

ఘరానా మొగుడు 28ఏళ్ల క్రితమే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 10కోట్లు రాబట్టిన తొలి సౌత్ ఇండియా మూవీగా అరుదైన ఘనత సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ట్విట్టర్ లో ఘరానా మొగుడు 10కోట్ల పోస్టర్ ను పెట్టాడు చిరంజీవి. నగ్మా.. వాణీ విశ్వనాథ్ గ్లామర్.. పరచూరి బ్రదర్స్ మాటలు.. కీరవాణి స్వరాలు.. ఇలా అన్నీ కలిసి సినిమాకు బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: