
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్ ఎన్నో విలక్షణ పాత్రలతో అలరించిన మహా నటుడు కోట శ్రీనివాస రావు. ఒక దశలో కోట లేని తెలుగు సినిమా లేదంటే అతిషయోక్తి కాదు. ఆ స్థాయిలో ఇండస్ట్రీలో సత్తా చాటిన ఈ విలక్షణ నటుడు సడన్ సినిమాలకు బ్రేక ఇచ్చారు. అంతేకాదు ఆరోగ్య పరంగానూ కోట చాలా దెబ్బ దిబ్బ తిన్నారు. అందుకు ప్రధాన కారణం ఆయన కుమారుడి మరణం.
2010 జూన్ 20 జరిగిన రోడ్ ప్రమాదం లో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు వెంకటసాయి ప్రసాద్ మృతి చెందాడు. అప్పుడు ఆయన వయసు కేవలం 39 సంవత్సరాలే. తన ఏకైక కుమారుడు ప్రమాదంలో చనిపోవడంతో కోట శ్రీనివాసరావు తీవ్ర మనో వేదనకు గురయ్యారు. పరిశ్రమలోని వ్యక్తులు, రాజకీయనాయకులు వచ్చి కోటను పరామర్శించేందుకు, ఓదార్చేందకు ఎంత ప్రయత్నించిన ఆయన గుండెల్లోని బాధను మాత్రం తగ్గించలేకపోయారు.
వెంకట సాయిప్రసాద్ తన స్పోర్ట్స్ బైక్ పై శంషాబాద్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కోట ప్రసాద్ భార్య, పిల్లలు, స్నేహితుడి కుటుంబంతో కలిసి ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు మధ్యాహ్నం 1 గంటకు ఫిలింనగర్ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలోని నోవాటెల్ హోటల్ కు బయల్దేరారు. ప్రసాద్ తన 1000 సీసీ స్పోర్ట్స్ బైకు (ఏపీ0938 డీఎక్స్-8474)పై ఒంటరిగా ప్రయాణించాడు. మిగతా వారంతా కలిసి కారులో వెనకే వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీ (అప్పా) దాటిన తరువాత దర్గా మలుపు వద్ద ఓ డీసీఎం రింగురోడ్డు పైకి అడ్డు రావటంతో సడన్‌గా బ్రేక్ వేశారు. దీంతో బైక్ రోడ్డును రాసుకుంటూ వెళ్లి డీసీఎం వ్యానును ఢీకొట్టింది. ఒక్కసారిగా బ్రేక్ వేయటంతో ప్రసాద్ ఎగిరి ఇరవై అడుగుల దూరంలో పడ్డారు. తలకు తీవ్ర గాయాలు కావటంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. కోట ప్రసాద్ సినీ పరిశ్రమలో వర్ధమాన నటుడిగా ఎదుగుతున్న సమయంలో ఆకస్మికంగా మృతి చెందటంతో కోట ఆ విషాదం నుంచి తేరుకోలేకపోయారు.