ఆర్ఆర్ఆర్ సినిమా ఏ మహూర్తాన మొదలు పెట్టారో కానీ చాలా వరకు అపశకునాలే ఎదురవుతున్నాయి. సినిమా నటీమణుల విషయంలో చాలా సందిగ్ధం నడిచింది. చివరకు రాజమౌళి కూడా క్యాస్టింగ్ విషయంలో రాజీ పడాల్సి వచ్చింది. ఆ తర్వాత అన్ని సినిమాలకు అడ్డం పడినట్టే కొవిడ్ ఈ సినిమా షూటింగ్ కీ అడ్డు తగిలింది. దీంతో షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. అయితే మిగతా సినిమాలకంటే ఈ సినిమా విషయంలో టెస్ట్ కట్ తో ఓ ప్రయోగం చేశారు రాజమౌళి. ప్రభుత్వం సినిమా చిత్రీకరణలకు అనుమతి ఇవ్వగానే.. శాంపిల్ షూటింగ్ చేశారు. ఆ ప్రయోగం విఫలమైంది. వెంటనే మరికొన్నాళ్లు సినిమా వాయిదా పడింది.
ఇక ఎన్టీఆర్ టీజర్ విషయంలో రాజమౌళి నెటిజన్లకు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బాగా టార్గెట్ అయ్యారు. రామ్ చరణ్ టీజర్ ని అనుకున్న టైమ్ కి విడుదల చేసిన రాజమౌళి, ఎన్టీఆర్ టీజర్ ఎప్పుడు విడుదల చేస్తారంటూ విపరీతంగా జక్కన్నని ట్రోల్ చేసారు. అది కూడా అయిపోయింది. చివరకు ఎన్టీఆర్ టీజర్ విడుదల తర్వాత వివాదాలు మరింత పెరిగాయి. ఈ టీజర్లో కొమురం భీమ్ పాత్ర చేస్తున్న ఎన్టీఆర్ చివర్లో ముస్లిం టోపీ పెట్టుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొమురం భీమ్ ని ముస్లింగా ఎలా చూపిస్తారంటూ ఆదివాసీ సంఘాలు మండిపడ్డాయి.

రోజు రోజుకీ టీజర్ వ్యవహారం మరింత పెరిగి పెద్దదవుతోంది. అల్లూరి, కొమురం భీమ్ అంటూ.. పోరాట యోధుల పేర్లను వాడుకుంటూ.. ఇది కల్పిత కథ అని చెప్పడం సరికాదని అంటున్నారు చాలామంది. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాబూరావు కూడా రాజమౌళిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోండు యోధుడు కొమురం భీమ్ చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రిస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

నిజాం పాలకులు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన భీమ్ కు ఇతర మతాల టోపీ పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు బాబూరావు. ఆ సన్నివేశాలు తొలగించాలని, లేకపోతే సినిమా విడుదలయ్యాక థియేటర్లపై దాడులు జరుగుతాయని కూడా హెచ్చరించారు.

ఈ దశలో వివాదానికి కారణమైన సన్నివేశాల్ని తొలగించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే రాజమౌళి మాత్రం వెనక్కి తగ్గుతారా లేదా అనేది డౌటే. ఇప్పటికే ఎన్టీఆర్ కి సంబంధించి ముస్లిం గెటప్ లో ఉన్న సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందట. దీన్ని ఇప్పుడు తిరిగి మార్చాలంటే కుదరదని, అందుకే రీ షూటింగ్ చేసే ప్రసక్తే లేదని సినిమా వర్గాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. గొడవ మరీ ముదిరి అసలుకే ఎసరు వస్తుందనుకుంటే రీ షూటింగ్ తప్పని వ్యవహారం అవుతుంది. లేదా సినిమా విడుదలయ్యాక ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయగలం అనే ధైర్యం ఉంటే మాత్రం రాజమౌళి ఆ సన్నివేశాల్ని అలాగే ఉంచుతారు. ఈ రెండిట్లో ఏది జరుగుతుందో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: