లాక్ డౌన్ కాలం లో తన పరోపకారమైన పనులతో రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సినీ విలన్ సోనూ సూద్ ఇప్పటికీ ప్రజల కోసం తన వంతు సహాయం చేస్తూనే ఉన్నారు. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో పడకల దొరక్క నానా ఇబ్బందులు పడుతుంటే వారికోసం సోనూ సూద్ సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. సామాన్య ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించడానికి ఆయన టీకా డ్రైవ్ "సంజీవని: ఎ షాట్ ఆఫ్ లైఫ్" ను ప్రారంభించారు. అంతేకాదు, ఇటీవల ఇండోర్‌లో కరోనా బాధితుల కోసం 10 ఆక్సిజన్ జనరేటర్లను ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలోనే దురదృష్టవశాత్తు ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన ఆయన తన గురించి ఎవరూ బాధపడొద్దని.. తన సహాయం కోసం ఎదురు చూసే ప్రజలను కాంటాక్ట్ అయ్యేందుకు తనకు ప్రస్తుతం ఎక్కువ సమయం దొరికిందని చెప్పుకొచ్చారు.




ఆయన తన ట్విట్టర్ పోస్టులో.. " ఈరోజు ఉదయం నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ముందుజాగ్రత్తల్లో భాగంగా నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్లి బాగా కేర్ తీసుకుంటున్నాను. కానీ మీరు బాధపడకండి.. దీనివల్ల మీ సమస్యలను పరిష్కరించేందుకు నాకు చాలా సమయం దొరుకుతుంది. మీ అందరికీ సహాయం చేయడానికి నేను ఎప్పటికీ సిద్ధంగా ఉంటానని గుర్తుపెట్టుకోండి." అని పేర్కొన్నారు.



సోనూ సూద్ 2021, ఏప్రిల్ 7వ తేదీన కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. ఆ సందర్భంగా ఆయన పాతికేళ్ళ వయసు లోపు వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా సోనూ సూద్ ఆచార్య సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఐతే ప్రస్తుతం సోనూ సూద్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆచార్య మూవీ యూనిట్ మొత్తానికి కరోనా టెస్టులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా చిరంజీవి టెస్ట్ చేయించుకునే అవకాశం ఉంది 

మరింత సమాచారం తెలుసుకోండి: