దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. వరుసగా రెండు రోజులు తగ్గిన కొత్త కేసులు మళ్లీ పెరిగాయి. దీంతో మరోసారి 3.5 లక్షలు దాటాయి. అదేవిధంగా మరణాలు కూడా నాలుగు వేలకు పైనే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,62,727 పాజిటివ్ కేసులు నమోదవగా, 4120 మంది మరణించారు. కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎంతో మంది ప్రజలు వైద్య సదుపాయం అందక ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కొందరికి ఆక్సిజన్ అందకపోవడం వల్ల మరికొందరికి బెడ్లు చాలకపోవడం వల్ల వైద్య సదుపాయాలు చాలకపోవడం వల్ల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎందరో సెలబ్రిటీస్ కోవిడ్ బాధితులకు ఆర్ధిక సహాయాన్ని, ఆక్సిజన్ సదుపాయాన్ని కల్పిస్తూ తమ వంతు తోడ్పాటును అందిస్తున్నారు.
ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో సూర్య ఫ్యామిలీ కోవిడ్ పై పోరాటానికి భారీగా ఆర్ధిక సహాయం చేసి వార్తల్లో నిలిచారు. సూర్య, ఆయన తండ్రి శివకుమార్, అతడి తమ్ముడు కార్తి తమిళనాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1కోటి విరాళాన్ని అందించారు. రూ. కోటి విలువైన చెక్కును సీఎం స్టాలిన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా వారి ఆర్థిక సహాయానికి తమిళ సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తున్నాయి. సామాన్య ప్రేక్షకులు, అభిమానులు సైతం వారి సేవల్ని ప్రశంసిస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సూర్య. అగరం ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. పేద విద్యార్థులకు మంచి చదువు చెప్పిస్తున్నారు. పదేళ్ల క్రితం మొదలైన ఈ ఫౌండేషన్ పేద విద్యార్థులకు చదువు చెప్పిస్తూ ఎంతో సహాయపడుతుంది. ఎన్నో వేల మంది పేదవారిని ఈ సంస్థ అక్కున చేర్చుకుని సాయం చేస్తోంది. విద్యలో ఉన్నత స్థానంలో వారిని నిలబెడుతూ వారి భవిష్యత్ కు పునాదులు వేస్తుండటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి