చలనచిత్ర రంగంలో సినిమాటోగ్రఫీ లేదా డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ అత్యంత కీలకమైన విభాగంగా చెప్పుకోవచ్చు. కథ ఎంత గొప్పగా ఉన్నా.. డైరెక్టర్ ఎంత ప్రతిభావంతుడైనా.. మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అందించకపోతే ప్రేక్షకులు సినిమా ఎంజాయ్ చేయలేరు. సన్నివేశాలు ఎంత కలర్ ఫుల్ గా రావాలో.. ఏ కోణంలో వీడియో రికార్డ్ చేస్తే బాగుంటుందో.. లైటింగ్ ఎలా సరి చేయాలో.. ఏ సీన్ కి ఏ లెన్స్ వాడాలో.. వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ సినిమాని చాలా అందంగా తీర్చిదిద్దటంలో సినిమాటోగ్రాఫర్ ప్రధాన పాత్ర పోషిస్తారు.


సినిమాటోగ్రాఫర్లు స్పెషల్ ఎఫెక్ట్స్ విషయంలో కూడా తమ కెమెరాతో అద్భుతం సృష్టించగలరు. కొన్నిసార్లు దర్శకుడు సన్నివేశాల చిత్రీకరణ విషయంలో సినిమాటోగ్రాఫర్ కే పూర్తిగా బాధ్యతలు అప్పగించేస్తారు. కొన్ని సందర్భాల్లో మాత్రం కెమెరా ఎలా ఉపయోగించాలో డైరెక్టర్ సలహాలిస్తుంటారు. సినిమా ఆడియోలో సంగీత దర్శకుడు పాత్ర ఎంత ఇంపార్టెంటో.. సినిమా విజువల్ కంటెంట్లో సినిమాటోగ్రాఫర్ పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్.



కాగా, మన టాలీవుడ్ పరిశ్రమలో కె. కె సెంథిల్ కుమార్ గొప్ప సినిమాటోగ్రాఫర్ అని చెప్పుకోవచ్చు. నాని, సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఈగ(2012) సినిమాలో సెంథిల్ కుమార్ కెమెరా పనితనం ఏంటో తెలుస్తుంది. ఒక చిన్న ఈగ కోపాన్ని, నవ్వును, ప్రేమను సెంథిల్ కళ్ళకు కట్టినట్లు చూపించి ప్రేక్షకులను బాగా అలరించారు. నిజానికి ఈ సినిమాతో సెంథిల్ తెలుగు చలనచిత్ర సినిమాటోగ్రఫీని వేరొక లెవల్ కి తీసుకెళ్లారు. ఈగ సినిమాలో అమోఘమైన సినిమాటోగ్రఫీ అందించినందుకు గాను సెంథిల్ కుమార్ కి 2012లో బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా నంది అవార్డు లభించింది.



బాహుబలి: ది బిగినింగ్ చిత్రానికి కూడా సెంథిల్ కుమారే సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో ప్రభాస్ సన్నివేశాలు గానీ తమన్నా సన్నివేశాలు గానీ ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసాయి. ఎంతో అందంగా ఉండే బాహుబలి సన్నివేశాలు ప్రేక్షకులను కళ్లప్పగించి చూస్తుండిపోయెలా చేశాయంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే ప్రస్తుతం సెంథిల్ ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా ఛాయాగ్రహణం అందిస్తున్నారు.



సెంథిల్ కుమార్ మంచి క్రికెటర్. తన యుక్త వయసులో సివిల్ సర్వీసుల్లో జాయిన్ కావాలనుకున్నారు. కానీ స్నేహితుడి సలహా మేరకు సినిమాటోగ్రఫీ లో మూడు సంవత్సరాల కోర్సు పూర్తి చేసి చలన చిత్ర రంగం లో అరంగేట్రం చేశారు. అమృతం సీరియల్, ప్రేమకు వేళాయరా, ఐతే సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన తర్వాత రాజమౌళి తో కలిసి సై సినిమా చేసి మంచి పేరు దక్కించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: