టాలీవుడ్లో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా, అసలు గ్యాప్ అన్నదే లేకుండా వరుసబెట్టి సినిమాలు చేసుకుపోయే హీరో మాస్ రాజా రవితేజ. స్టార్ హీరోల్లో రవితేజ అంత స్పీడు ఇంకెవరూ చూపించరు అంటే అతిశయోక్తి కాదు.
పెద్ద హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా గగనంగా మారిన పరిస్థితుల్లో ఏటా రెండు మూడు రిలీజ్‌లు ఉండేలా చూసుకుంటాడు మాస్ రాజా.

గతంలో రాజా ది గ్రేట్‌కు ముందు కొంచెం గ్యాప్ వచ్చిందే తప్ప.. అంతకుముందు, తర్వాత రవితేజ విరామం లేకుండా సినిమాలు చేశాడు. వరుసగా ఫ్లాప్‌లు వచ్చినా అతను వెనక్కి తగ్గింది లేదు. గత ఏడాది క్రాక్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టాక వరుసగా సినిమాలు ఓకే చేశాడతను. ఐతే అతడి ఉత్సాహానికి ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాలు బ్రేక్ వేశాయి. ఇవి ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లయ్యాయి. ముఖ్యంగా రామారావు సినిమా అయితే మినిమం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. మాస్ రాజా మీద అభిమానులు ఆశలు కోల్పోయేలా చేసింది.

అలా అని రవితేజేమీ డీలా పడిపోలేదు. చకచకా తన కొత్త సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్‌, హలో గురూ ప్రేమ కోసమే లాంటి హిట్లు ఇచ్చిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ రాజా ధమాకా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చడీచప్పుడు లేకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేశాడు రవితేజ. బుధవారమే ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సినిమా మొదలై, షూటింగ్ జరుపుకుంటుండగా.. పెద్దగా హడావుడి లేదు.

రామారావు డిజాస్టర్ కావడంతో ఉన్నట్లుండి ధమాకా టీం ఈ సినిమాను వార్తల్లో నిలిపే ప్రయత్నం చేసింది. కొన్ని ప్రోమోలతో హడావుడి చేసింది. ఇప్పుడు షూటింగ్ పూర్తయినట్లు ఒక వీడియోద ద్వారా వెల్లడించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి దీపావళికి సినిమాను రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ ఏడాది అటు ఇటుగా ఆరు నెలల వ్యవధిలో మాస్ రాజా మూడో సినిమాతో పలకరించబోతున్నాడన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: