
‘కాంతార’ది మరో అధ్యాయం. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ఇది. ‘కేజీఎఫ్’లానే ‘కాంతార’పైనా ఎవరికీ నమ్మకాల్లేవు. ప్రొడక్షన్ దశలో ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు కూడా. అంతెందుకు... చిత్రబృందమే దీన్ని ‘పాన్ ఇండియా’ సినిమా అనుకోలేదు. ముందు కన్నడలో రిలీజ్ చేశారు. అక్కడ అనూహ్యమైన స్పందన రావడంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాని చూపించారు. ఇప్పుడు ‘కాంతార’ వసూళ్లు రెండొందల కోట్లు దాటేశాయి. రూ.16 కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ.200 కోట్లు అందుకోవడం నిజంగా ట్రేడ్ పరంగా ఓ అద్భుతం. తెలుగులో గీతా ఆర్ట్స్ ఈ సినిమాని రూ.5 కోట్లకు కొంటే వాళ్లకు ఏకంగా రూ.20 కోట్ల లాభాలొచ్చాయి. రిషబ్ శెట్టి ఇది వరకు తీసిన ‘గరుడ గమన రుషబ వాహన’ కూడా కన్నడలో పెద్ద హిట్‌గా నిలిచింది. అక్కడ ఈ సినిమాకి క్లాసిక్‌గా అభివర్ణిస్తుంటారు. త్వరలోనే ఉపేంద్ర సినిమా ‘కబ్జా’ రాబోతోంది. దీన్ని కూడా భారీగా ఖర్చు పెట్టి పాన్ ఇండియా స్థాయిలో తీశారు. ఇటీవలే టీజర్ విడుదల చేశారు. కబ్జాపై కేజీఎఫ్ ముద్ర ఉందన్న విషయం టీజర్లో తేలిపోయింది. ఈ సినిమాలన్నీ కన్నడ చిత్రసీమ స్థాయిని పెంచడమే కాదు, అక్కడి నిర్మాతలకు, నటీనటులు సాంకేతిక నిపుణులకు కొండంత భరోసా కలిగించాయి. కంటెంట్‌లో బలముంటే పాన్ ఇండియా స్థాయిలో జెండా ఎగరేయొచ్చన్న నమ్మకాన్ని కలిగించాయి. ‘బనారస్’ అనే ఓ లవ్ స్టోరీ నవంబరు 4న పాన్ ఇండియా స్థాయిలోనే విడుదల అవుతోంది. ఈ సినిమా కూడా క్లిక్ అయితే... కన్నడ శోభ మరింత విస్తరిస్తుంది.
వసూళ్లూ, లాభాలు.. ఈ మాట పక్కన పెడితే కన్నడ సంస్కృతి, సంప్రదాయాలు దేశ వ్యాప్తంగా తెలియడానికి ఈ చిత్రాలు దోహదం చేశాయి. ముఖ్యంగా ‘కాంతార’ ద్వారా భూత్ కోలా కళ వెలుగులోకి వచ్చింది. ‘కాంతార’ విడుదలైన తరవాత భూత్ కోలా కళాకారులకు పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇదంతా సినిమా సాధించిన విజయమే. తెలుగు, తమిళ, మలయాళ చిత్రసీమల నుంచి వందల కోట్ల విలువైన సినిమాలొస్తున్నాయి. ఇప్పుడు కన్నడ కూడా తోడైంది. బాలీవుడ్‌ని మించే స్టఫ్ సౌత్ ఇండియన్ సినిమాలు ఇవ్వగలవని ఇప్పటికే నిరూపితమైపోయింది. ఇక మీదట ఇండియన్ సినిమా అంటే.. ఇండియన్ సినిమానే. ఇప్పుడు భాషా బేధాలు, ప్రాంతీయ బేధాలు లేనే లేవు.