టాలీవుడ్‌లో గత కొద్దిరోజులుగా నిశ్శబ్దం నెలకొంది. కెమెరాలు మోగడం లేదు … సెట్స్‌లో లైట్లు వెలగడం లేదు … కారణం ఒకటే – ఫెడరేషన్ సమ్మె. వేతనాల పెంపు కోసం ఫెడరేషన్ బృందం నిర్మాతలపై ఒత్తిడి తెస్తోంది. కానీ ఇరు పక్షాల మధ్య చర్చలు ఎప్పటికీ ఒకే పాయింట్ వద్ద ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు తాజా స్పందన అందరి దృష్టిని ఆకర్షించింది. సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత మీడియా ముందుకు వచ్చిన దిల్ రాజు – "వేతనాలు పెంచడానికి మేము సిద్ధమే, కానీ కొన్ని షరతులు తప్పనిసరి" అని స్పష్టంచేశారు. ఆయన చెప్పిన ప్రకారం 2018, 2022లో జరిగిన అగ్రిమెంట్స్‌లో రెండు కీలక షరతులు ఉన్నాయి. కానీ ఫెడరేషన్ వాటిని ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు.


"ముందుగా ఆ రెండు షరతులకు అంగీకరించాలి. అదికాకుండా, మేము సూచించిన మరో రెండు షరతులపై కూడా చర్చ జరగాలి. ఇవన్నీ అమల్లోకి వస్తే, వెంటనే వేతనాలు పెంపు విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటాం" అని దిల్ రాజు వెల్లడించారు. ఇప్పటివరకు జరుగుతున్న చర్చలు సానుకూల వాతావరణంలో సాగుతున్నాయని ఆయన పేర్కొన్నా, సమ్మె ఎప్పుడు విరమించబడుతుందనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. "మరికొన్ని రెండు లేదా మూడు సార్లు చర్చలు జరగాలి. అన్ని పాయింట్లపై అంగీకారం కుదిరితేనే ఫైనల్ అవుతుంది" అని అన్నారు.ఈ పరిస్థితుల్లో టాలీవుడ్‌లో షూటింగులు ఎప్పుడు పునఃప్రారంభం అవుతాయనే ఉత్కంఠ పెరిగింది. ఫెడరేషన్‌ వైపు నుండి కూడా వెనక్కి తగ్గే లాంటి సంకేతాలు రావడం లేదు.



 ఒకవైపు ప్రొడ్యూసర్లు ‘షరతులు ముందుగా’ అంటుంటే… మరోవైపు ఫెడరేషన్ ‘వేతనాలు ముందుగా’ అని పట్టుబడుతోంది. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో, లక్షలాది సినీ కార్మికులు, టెక్నీషియన్లు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న, మధ్యస్థ చిత్రాలు పూర్తిగా ఆగిపోయాయి. పెద్ద సినిమాల షెడ్యూల్స్ కూడా వాయిదా పడుతున్నాయి. షూటింగ్ లొకేషన్లలో కదలిక లేకపోవడం వల్ల టాలీవుడ్ కలరఫుల్ వాతావరణం కాస్త ఖాళీగా కనిపిస్తోంది.మొత్తానికి, ఈ సమ్మె ఎంతకాలం కొనసాగుతుందో… దిల్ రాజు సూచించిన షరతులను ఫెడరేషన్ అంగీకరిస్తుందో లేదో… ఈ చర్చలు ఎప్పుడు ఫైనల్‌ అవుతాయో అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: