
ఇటీవల జరిగిన ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ స్వయంగా శ్రియాపై ప్రశంసలు కురిపించారు. "ఆమె ఫిట్‌నెస్ లెవెల్స్ చూస్తే మతిపోతుంది .. ఆమెతో గొడవ పెట్టుకోవాలంటే ఎవరైనా రెండుసార్లు ఆలోచించాల్సిందే" అంటూ పవన్ స్టేజ్ మీద చెప్పడంతో ఒక్కసారిగా అందరి దృష్టి శ్రియాపై పడింది. మరి పవన్ ప్రశంసలు అందుకున్న ఈ నటి అసలు ఎవరు? శ్రియా రెడ్డి టీమిండియా మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి కుమార్తె. భరత్ రెడ్డి 1978 నుంచి 1981 మధ్యకాలంలో జాతీయ జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ గా ఆడారు. టెస్టులు, వన్డేలు ఆడిన ఆయన రిటైర్ అయిన తర్వాత చెన్నైలో క్రికెట్ ట్రైనింగ్ క్యాంపులు నడిపారు. దినేష్ కార్తీక్, లక్ష్మీపతి బాలాజీ లాంటి స్టార్ క్రికెటర్లు ఆయన కోచింగ్ లో రాణించారు. ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శ్రియా మొదట వీజేగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత బుల్లితెర మీద తన సొంత గుర్తింపు తెచ్చుకుంది.
తరువాత వెండితెర వైపు అడుగుపెట్టిన శ్రియా, తమిళ్ లో పలు సినిమాలు చేసి ఫేమస్ అయింది. ముఖ్యంగా విశాల్ హీరోగా వచ్చిన పొగరు సినిమాలో శ్రియా నటన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆ సినిమా ఆమెకు స్టార్ ఇమేజ్ ఇచ్చింది. తెలుగులో కూడా అమ్మ చెప్పింది, అప్పుడప్పుడూ, సలార్ లాంటి మూవీల్లో తనదైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. విశాల్ అన్నయ్య, పొగరు చిత్ర నిర్మాత విక్రం కృష్ణను ప్రేమించి 2008లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా, ఫిట్‌నెస్, లుక్ తో ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గడం లేదు. ఓజీలో పవన్ పక్కన శ్రియా రెడ్డి ఎంట్రీ.. సినిమా హైలైట్ అవుతుందని ట్రేడ్ టాక్ వినిపిస్తోంది. అందుకే పవన్ చెప్పినట్లే.. "శ్రియాతో గొడవ పెట్టుకోవాలంటే ఆలోచించాల్సిందే"!