తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వ్యవహార శైలి ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. ఒకరు రాజకీయంగా సీనియర్ నేత అయితే.. మరొకరు మాత్రం రాజకీయాల్లో జూనియర్‌గానే చెప్పుకోవాలి. ప్రత్యర్థి ఎత్తులను ఇట్టే పసి గట్టగల సమర్థులు ఒకరైతే.. మరొకరు మాత్రం... అసలు ప్రత్యర్థులకు అవకాశం లేకుండానే చేసేశారు. వాళ్లిద్దరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇద్దరు ముఖ్యమంత్రులే అయినప్పటికీ... వారి వ్యవహరిస్తున్న తీరు మాత్రం పూర్తి విరుద్ధం. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ మరోసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. 2019లో తిరుగులేని విజయం సాధించి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తొలిసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు. అయితే ఇద్దరి మధ్య తేడా మాత్రం చాలా ఉంది. ప్రగతి భవన్‌కే పరిమితమయ్యారని ప్రతిపక్షాలు విమర్ళలు చేస్తున్నా కూడా... అప్పుడప్పుడూ మీడియా సమావేశాలు పెడుతుంటారు కేసీఆర్. ఇక ఉప ఎన్నికల సమయంలో అయితే... స్వయంగా రంగంలోకి దిగుతారు. అవసరమైతే ఎన్నికల ప్రచారం కూడా చేస్తారు. అయినా సరే దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో ఓడారు. ఇక ఇప్పుడు అయితే ఏకంగా దాదాపు వారానికి రెండుసార్లు ప్రెస్ మీట్‌లు పెట్టేస్తున్నారు. గంట పాటు మాట్లాడేస్తున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. కనీసం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం కూడా దాటి బయటకు రావడం లేదు. ఎన్నికలు ఏవైనా సరే... జగన్ తీరు ఇదే. ఎన్నిక ఏదైనా సరే... ఎంత కీలకమైనా సరే... కాలు బయట పెట్టడం లేదు. ఒక్కసారి కూడా అటు వైపు చూడటం లేదు. కానీ వెనకుండి చక్రం తిప్పుతున్నారు. గెలిచేస్తున్నారు. అది కూడా అలా ఇలా కాదు... బంపర్ మెజారిటీతో. చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపాలిటీ ఎన్నికల సమయంలో కూడా జగన్ ఏ మాత్రం పాల్గొనలేదు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు కూడా దూరంగానే ఉన్నారు. కేవలం ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఇక రెండున్నర ఏళ్ల పరిపాలనలో అయితే... కేవలం ఒక్కటంటే ఒక్కటే ప్రెస్ మీట్ నిర్వహించారు. అది కూడా గతేడాది మార్చి నెలలో. లాక్ డౌన్‌కు ముందు. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రెస్ ముందుకు వచ్చారు. అంతే... ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. తిరుపతి, పులివెందుల అంతే తప్ప... మరే పర్యటన లేదు. అయినా సరే... ఎన్నికల్లో మాత్రం గెలిచేస్తున్నారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: