సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వాతి హత్యకేసు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 24వ తేదీన టెక్కీ స్వాతిని చెన్నైలోని నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి కత్తితో అతి దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలన ద్వారా కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని రామ్‌కుమార్‌గా గుర్తించారు. నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు తిరునల్వేలిలో తలదాచుకున్న రామ్‌కుమార్ అరెస్ట్ చేశారు.



పోలీసులను గమనించిన నిందితుడు తన వద్ద ఉన్న బ్లేడుతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతన్ని తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు. తిరునల్వేలి చెందిన రామ్‌కుమార్‌ ఇంజినీరింగ్ ముగించుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో చెన్నైకు వచ్చినట్లు గుర్తించారు. స్వాతి నివాసం ఉండే ప్రాంతంలోనే రామ్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 



ఈ కేసుకు సంబంధించి ఓ ప్రత్యక్ష సాక్షి పలు వివరాలు వెల్లడించారు. పట్టపగలు రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగా స్వాతిని హత్య చేసిన దాదాపు వారం రోజుల తర్వాత ఒకరు ముందుకొచ్చి మాట్లాడారు. స్వాతి హత్యకు కొద్దిరోజుల ముందే స్వాతిని ఓ వ్యక్తి కొట్టడం చూశానని డి.తమిళరసన్‌ అనే ఉపాధ్యాయుడు తెలిపారు. ఆయన స్వాతి ఉండే ప్రాంతంలోనే ఉంటున్నారు. అయితే సీసీటీవీ ఫుటేజీలోని వ్యక్తి.. అంతకుముందు స్వాతిని కొట్టిన వ్యక్తి ఒక్కరే కాదని చెప్పారు. 



హత్య జరిగిన సమయంలో నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌కు కొంచెం దూరంలో ఉన్నానని తమిళరసన్‌ తెలిపారు. తాను అక్కడికి వెళ్లేసరికి స్వాతి చనిపోయిందని చెప్పారు. ఈ హత్యతో తాను చాలా షాక్‌కు గురయ్యానని.. తర్వాత రైల్లో అక్కడి నుంచి వెళ్లిపోయానని వెల్లడించారు. స్వాతిని అంతకుముందు నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లోనే ఓ వ్యక్తి 4, 5 సార్లు చెంపదెబ్బలు కొట్టాడని.. ఈ విషయం ఎవరితోనైనా చెప్పడానికి భయపడ్డానని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: