మరోసారి రాయలసీమలో ఫ్యాక్షన్ కక్షలు భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జీ నారాయణ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. పెళ్లికి వెళ్లి తిరిగి
వస్తున్న నారాయణ రెడ్డి వాహనంపై ప్రత్యర్థులు కృష్ణగిరి సమీపంలోకి బాంబులు వేసిరారు. వాహనం పంటపొలాల్లోకి దిగిపోవడంతో వాహనం దిగి పరుగెత్తుతున్న నారాయణ రెడ్డిని వేటకొడవళ్లతో నరికి చంపారు.
నారాయణ రెడ్డి గత ఎన్నికల్లో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై పోటీ చేసి ఓటమిపాలయ్యారు. నారాయణరెడ్డిది రాజకీయ హత్యేనని వైసీపీ ఆరోపిస్తోంది. నంద్యాల ఉప
ఎన్నికల కోసం, పార్టీ కోసం కీలకంగా పని చేస్తున్ననారాయణరెడ్డిని అధికార పార్టీ హత్య చేయించిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఈ సంఘటనకు డిప్యూటీ సీఎం
కేఈ కృష్ణమూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డిని హత మార్చింది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులేనని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి కూడా ఆరోపించారు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచారణ నిర్వహించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ... నారాయణరెడ్డి హత్యకూ తనకూ ఏ సంబంధమూ లేదని కేఈ అన్నారు.
కావాలనే వైఎస్సార్సీపీ తనపై నిందలు వేస్తోందని కేఈ అంటున్నారు. నారాయణరెడ్డి, ఆయన అనుచరుడు సాంబశివుడులను తన అనుచరులే చంపారని విచారణలో తేలితే, వాళ్లకు శిక్ష పడేందుకు సహకరిస్తానన్నారు. నారాయణరెడ్డికి గన్ మెన్ లను ఎస్పీ ఎందుకు తొలగించారో తనకు తెలియదన్నారు కేఈ. ప్రాణహాని ఉందని నా దృష్టికి తెచ్చి ఉంటే తప్పక రక్షించేవాడినని కేఈ చెప్పుకొచ్చారు.