సమాజంలో రోజు రోజుకు పెరుగుతున్న పాశ్చాత్యీకరణ మనుషుల్లో కొత్త కొత్త ఆలోచనలకు తెర లేపుతున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని ఒక పిల్లవాడు ప్రేమ విఫలం అయిందని బలవన్మరణానికి పాల్పడ్డ సంఘటన చిత్తూరు జిల్లా ములకలచెరువు హాస్టల్‌లో చోటు చేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ లో చదువుతూ, హాస్టల్ లో ఉంటున్న 9వ తరగతి బాలుడు... తన తరగతి గదిలోని బాలికను ప్రేమించాడు. పట్టుమని పదిహేనేళ్లు కూడా రాకుండానే, చేసేది తప్పో ఒప్పో తెలియని వయసులోనే సదరు ప్రియురాలికి బహుమతి పంపాడు.

దానిని ఆమె తిరస్కరించింది. ప్రేమను తిరస్కరించడంతో మంగళవారం అర్ధరాత్రి హాస్టల్‌లో గుళికల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.హాస్టల్ సిబ్బంది గమనించి అతడిని 108లో మదనపల్లె ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు హాస్టల్ లో ఉండేందుకు దరఖాస్తు చేసుకున్నాడని, సీట్ల కేటాయింపులో స్థానం దక్కనప్పటికీ హాస్టల్ లో ఉంటున్నాడని హాస్టల్ వార్డెన్ తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్టు ఆయన తెలిపారు.
ముఖ్యంగా పిల్లలపై సినిమాల ప్రభావం అమితంగా పడుతుంది. తెలిసీ తేలాయని వయసులో జీవితంపై సరైన అవగాహన కలగని క్రమంలో ప్రేమలో పడడం అది విఫలం కావడంతో తీరా ఆత్మహత్యకు పాల్పడడం లాంటివి జరుగుతూ ఉన్నాయని సామజిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు పెరుగుతున్న సమయంలో వారి ప్రవర్తనపై తల్లి దండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలని, వారి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు వచ్చినా వారిని గమనించాలని, నిలదీయాలని, జీవితం అంటే ఏంటో వారికి అర్థం అయ్యేలా చెప్పాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి