ఏపీకి దుగరాజపట్నం పోర్టు ను జాతీయ పోర్టుగా ఏర్పాటు చేస్తామన్నది ఏపీ విభజన కాలం నాటి హామీ.. కానీ కొన్ని కారణాల వల్లదాన్ని ఏర్పాటు చేయలేమని కేంద్రం తేల్చి చెప్పింది. అందుకే ఇప్పుడు దుగరాజపట్నం బదులుగా... జాతీయ పోర్టులుగా రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులను గుర్తించి అభివృద్ధి చేయాలని జగన్ సర్కారు కేంద్రాన్ని కోరుతోంది.


ఈ మేరకు.. జగన్ విజ్ఞప్తిని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కేంద్రానికి వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అందాల్సిన సహకారంపై కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవియాను బుధవారం ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రికి అందజేశారు.


విభజన హామీలను కేంద్రమంత్రికి వివరించారు. అనంతరం గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దుగరాజపట్నం పోర్టును జాతీయ పోర్టుగా గుర్తించి ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాల దృష్ట్యా ముందుకు సాగలేదని మంత్రికి తెలిపినట్లు వెల్లడించారు. కాగా ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాలను చూపించాలని కేంద్రం కోరిందని తెలిపారు. దీంతో రామాయపట్నం, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. బకింగ్‌ హామ్‌ కెనాల్‌లో జల రవాణా విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు గౌతమ్‌ రెడ్డి తెలిపారు.


ఆంధ్రప్రదేశ్ అతి పెద్ద కోస్తా తీరం భగవంతుడు ఇచ్చిన వరం.. దేశంలో గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన కోస్తా తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్ర ప్రదేశే కావడం విశేషం. దాదాపు ఏపీకి వెయ్యి కిలో మీటర్ల తీర ప్రాంతం ఉంది. ఈ తీరం లో జాతీయ పోర్టుల ఏర్పాటు ద్వారా విదేశీ వాణిజ్యానికి చాలా అనువైన పరిస్థితి ఉంటుంది. బ్రిటీష్ వారి కాలంలో మచిలీ పట్నం పోర్టు చాలా ప్రసిద్ధి చెందింది. తెలుగు రాష్ట్రాల ఉత్పత్తులను విదేశాలకు సులభంగా చేరవేసేందుకు ఈ పోర్టు బాగా ఉపయోగపడతాయి. వేల కోట్ల ఆదాయం కూడా తెస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: