హిందువుల ముఖ్యమైన పండుగలలో
దసరా పండుగ ఒకటి. పదిరోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు. అశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుండి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు అని పదవ రోజు విజయదశమితో కలిపి
దసరా అని అంటారు. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవ రోజు పార్వేట ఉంటుంది. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారు.
చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భం మాత్రమే కాకుండా పాండవులు వనవాసం వెళుతూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తీసిపెట్టిన రోజు మరియు దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి మహిషాసురుడిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు విజయదశమిని జరుపుకుంటారు.
మహిషాసురుడనే రాక్షసుడు మరణం లేని జీవనం కోసం మేరుపర్వత శిఖరం చేరి బ్రహ్మదేవుని గూర్చి ఘోర తపస్సు చేయగా బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమవుతాడు. బ్రహ్మ దేవుడు మహిషాసురుడిని వరం కోరుకోమని చెప్పగా మరణం లేని జీవితాన్ని ప్రసాదించమని మహిషాసురుడు కోరుతాడు. బ్రహ్మ దేవుడు నీ కోరిక తీర్చుట అసంభవమని చెప్పగా మహిషాసురుడు పురుషుడి వలన నాకు మరణం రాకుండా అనుగ్రహించమని కోరగా బ్రహ్మ దేవుడు అనుగ్రహిస్తాడు.
బ్రహ్మ దేవుడు ఇచ్చిన వరాలతో మహిషాసురుడు దేవతలతో యుద్ధం చేసి
ఇంద్ర పదవి చేపడతాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మహిషాసురుని గురించి మొరపెట్టుకోగా త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై స్త్రీ రూపమై జన్మించింది. స్త్రీ రూపమై జన్మించిన దుర్గా దేవి సర్వ దేవతల ఆయుధములు సమకూర్చుకుని మహిషాసురుని సైన్యంతో తలపడి మొదట మహిషాసురుని సైన్యాన్ని సంహరిస్తుంది. మహిషాసురుడు మహిషి రూపంలో దేవి చేతిలో హతమైనాడు. అప్పటినుండి మహిషాసురుడిని సంహరించి వధించిన సందర్భంగా
దసరా పండుగ ప్రజలు జరుపుకుంటున్నారు.