మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఏం జరిగినా జగన్ బాధ్యత వహించాలని చెప్పారు. సీఎంతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తనకు జరగకూడనిది జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అభ్యర్థులకు ఏదైనా హాని జరిగితే తాను బాధ్యత వహిస్తానని చెప్పారు. అవసరం అనుకుంటే పార్టీకి రాజీనామా చేసి పోరాటాన్ని కొనసాగిస్తానని వ్యాఖ్యలు చేశారు. 
 
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను తీసుకెళ్లానని అన్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలు బీజేపీ అభ్యర్థిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నాలు చేశారని... బీజేపీ కార్యకర్తలు కిడ్నాప్ ను అడ్డుకున్నారని.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై బీజేపీ నేతలు దాడి చేశారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆదినారాయణ రెడ్డి ఖండించారు. 
 
రెండు రోజుల క్రితం జమ్మలమడుగులోని దేవగుడిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ శివనాథరెడ్డిపై కేసులు నమోదు చేశారు. ఆదినారాయణ రెడ్డి అనుచరులు వైసీపీ నేత రెడ్డయ్యతో పాటు మరికొందరిపై దాడులు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేతలు చేసిన దాడిలో గాయపడిన రెడ్డయ్య ప్రస్తుతం ప్రొద్దుటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
తనపై ఆదినారాయణ రెడ్డి వర్గం దాడి చేయడంతో రెడ్డయ్య పోలీసులకు ఈ ఘటన గురించి ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఆదినారాయణ రెడ్డి స్పందించారు. ఎన్నికలు జరిగే సందర్భాల్లో జమ్మలమడుగు నియోజకవర్గం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా వైసీపీ బీజేపీ నేతలు దాడులు చేసుకోవడంతో మరోమారు వార్తల్లోకెక్కింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: