కరోనా కేసులు పెరుగుతుండటంతో.. ఏపీ సర్కార్  హై అలర్ట్ ప్రకటించింది. అనుమానితులు ఉన్న ప్రాంతాల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.  అలాగే లాక్‌డౌన్‌ మరింత కఠినతరం చేసే దిశగా ఆదేశాలు జారీ చేశారు. 

 

ఆంధ్రప్రదేశ్‌ను వైరస్‌ వణికిస్తోంది. నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం పటిష్టమైన చర్యలకు దిగుతోంది. పాజిటివ్ వ్యక్తుల ఇళ్లకు కిలోమీటర్ మేర రాకపోకలు సాగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు.  ఇంటింటికీ ర్యాపిడ్ సర్వే చేస్తున్నారు. హాట్ స్పాట్ల దగ్గర మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. అటు సీఎం జగన్ కూడా ఎప్పటికప్పుడు అధికారుతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా కట్టడికి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. లాక్ డౌన్ మరింత కఠినంగా అమలుచేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చారు. 

 

రాష్ట్రవ్యాప్తంగా నిత్యావసరాల కొనుగోలుకు సమయం కుదించారు. అత్యవసర పనులు మినహా ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. నిబంధనలు ధిక్కరిస్తే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాజిటివ్ వ్యక్తుల్ని ఐసోలేషన్ కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు.. అనుమానం ఉన్నవాళ్లకు హోం క్వారంటైన్ సూచిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ర్యాపిడ్ సర్వేలో జ్వరం, జలుబు లాంటి లక్షణాలుంటే.. కరోనా పరీక్షలు చేస్తున్నారరు. ఒకే ప్రాంతంలో ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైతే.. అక్కడ్నుంచి ఎవరూ ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు. రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నారు. రెడ్ జోన్ పరిధిలో హైపోక్లోరైడ్ స్ప్రేతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు మెరుగుపరుస్తున్నారు. మర్కజ్ కు వెళ్లినవారిని గుర్తించడంలో యంత్రాంగం వేగంగా స్పందించింది. సత్వర చర్యలతో పాజిటివ్ కేసులన్నీ త్వరగా బయటికొస్తున్నాయి. 

 

ఒకే ప్రాంతంలో ఎక్కువ పాజిటివ్ కేసులుంటే హాట్ స్పాట్లుగా గుర్తిస్తారు. హాట్ స్పాట్ల వద్ద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేగంగా జియో ట్యాగింగ్ చేస్తున్నారు. మర్కజ్ సంబంధీకులున్నచోట్ల జియో ట్యాగింగ్ మరింత స్పీడుగా జరుగుతోంది. హోమ్ క్వారంటైన్లో ఉన్నవాళ్లపై ప్రభుత్వ బృందాలు నిఘా పెంచాయి. ఒక్కో బృందం ఇరవై మంది వ్యక్తుల్ని పరిశీలిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో హోం క్వారంటైన్లో ఉన్నవాళ్లపై ఫిర్యాదులు రావడంతో.. వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: