కరోనా విజృంభణ పుణ్యమా అని తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా లాక్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖ కు కరోనా వ్యాప్తి అరికట్టడం, కరోనా రోగులకు చికిత్స అందించడమే ప్రధాన లక్ష్యంగా మారింది. అయితే ఈ కరోనా కారణంగా చాలా ప్రధాన ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నత్తనడకన సాగుతున్నాయి. దీనికి తోడు సామాన్యులు ఇతర అనారోగ్యాలకు చికిత్సలు చేయించుకోలేకపోతున్నారు.
అయితే ఏపీలో జగన్ సర్కారు ఇలాంటి వారి కోసం ఓ ప్రత్యామ్నాయం ఆలోచించింది. టెలి మెడిసన్ విధానం ద్వారా రోగులకు సేవలు అందిస్తోంది. వైయస్‌ఆర్ టెలీ మెడిసిన్ పేరుతో సేవలు అందిస్తున్నారు. వీటిని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. డయాలసిస్ వంటి చికిత్సలు అవసరమైన వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.
వైద్యం కోసం వైయస్‌ఆర్ టెలీ మెడిసిన్‌ను సంప్రదిస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిందని, ఇప్పటి వరకు 8,395 మంది టెలీ మెడిసిన్ ద్వారా వైద్యులను సంప్రదించారని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. మరింత సమర్థవంతంగా టెలీ మెడిసిన్ విధానాన్ని అమలు చేయాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. డీఆర్డీవో ద్వారా మొబైల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలని సీఎం తెలిపారు. వలస కూలీలు, వివిధ క్యాంపుల్లో ఉన్న వారిని పరీక్షించడానికి ఇది ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు.
లాక్ డౌన్ కారణంగా ఇళ్ల నుంచి బయటకు రాలేక అనారోగ్యంతో బాధపడుతున్నవారికి ఈ టెలీ మెడిసిన్ ఓ వరంగా మారింది. ఇలాంటి సౌకర్యం తెలంగాణలో ఉన్నట్టు వార్తలు లేవు. ఒకటి రెండు చోట్ల ఉన్నా.. అది పైలట్ ప్రాజెక్టుగానే ఉంది తప్ప.. రాష్ట్రవ్యాప్తంగా టెలి మెడిసిన్ సేవలు లేవనే చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి