అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరకొచ్చేశాయి. జోబైడెన్, ట్రంప్ ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. డెమెక్రటిక్ పార్టీ అభ్యర్ధి జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కన్నా ప్రజాదరణలో ముందున్నారని ఇటీవల జరిగిన పోల్ సర్వేలు చెబుతున్నాయి.
కీలక రాష్ట్రాల్లో బైడెన్ కు ప్రజల మద్దతు లభిస్తున్నట్లు తేలింది. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా నామినేట్ అయినప్పటి నుంచి ప్రజాదరణలో ట్రంప్ కన్నా ఒక అడుగు ముందే ఉన్నారు బైడెన్. ట్రంప్ ఓడిపోవడం ఖాయమని ఎన్నికల విశ్లేషకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
అమెరికా ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరుగనున్నాయి. ఆ రోజు ఓటు వేయడం కుదరని వారి కోసం ఇప్పటికే ఎర్లీ ఓటింగ్ కూడా మొదలైపోయింది. కరోనా నేపథ్యంలో ప్రజలు ముందుగానే ఓటు హక్కును వినియోగించుకోవాలని డెమొక్రాట్లు కోరుతున్నారు. ముందుగానే ఓటు వేయడం ద్వారా నవంబర్ మూడో తేదీన క్యూ లేకుండా చూడొచ్చని అంటున్నారు. యూఎస్ ఎలక్షన్స్ ప్రాజెక్ట్ ప్రకారం ఇప్పటివరకు అమెరికా వ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మరోపక్క జో బిడెన్ తో డిబేట్ లో పాల్గొంటానని ట్రంప్ ప్రకటించారు. ఈ నెల 22న టెన్నెస్సీలోని బెల్మంట్ యూనివర్సిటీలో ప్రెసిడెన్షియల్ డిబేట్ కు రెడీగా ఉన్నట్టు చెప్పారు.
అనుకున్నట్టుగానే ఎన్నికల ప్రచారంలో కరోనా కీలక అంశంగా మారింది. ప్రభుత్వంలోని ఆరోగ్య నిపుణులు కరోనాని ఎదుర్కోవడంలో తీవ్రంగా విఫలమయ్యారంటూ డెమొక్రాట్లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ట్రంప్ నిర్లక్ష్యంతో అమెరికన్ల ప్రాణాలు రిస్క్ లో పడ్డాయని ప్రత్యర్థి జో బైడెన్ ఆరోపించారు. ఈ విమర్శలను ట్రంప్ తిప్పికొడుతున్నారు. లాస్ వెగాస్ ఎన్నికల ప్రచారంలో ఆంటోని ఫౌచీ, ఇతర నిపుణులపై నోరు పారేసుకున్నారు ట్రంప్.
అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే చర్చా కార్యక్రమంలో కొత్త నిబంధనలు ఏర్పాటయ్యాయి. అభ్యర్థులు ఒకరికొకరు వాదనలో అడ్డుపడకుండా ఉండేందుకు మైక్రోఫోనులను రెండు నిమిషాల లెక్కన మ్యూట్ చేస్తారు. ఇద్దరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి