నారా లోకేష్.. ఇటీవల జనంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. లాక్ డౌన్ కాలంలో హైదరాబాద్ కి పరిమితం అయిన లోకేష్.. ఇటీవల ఏపీలో ఓదార్పు యాత్రలు చేస్తున్నారు. వరదల్లో నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తూ.. సీఎం జగన్ పై, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా సీఎం జగన్ పై మరోసారి మాటల తూటాలు పేల్చారు లోకేష్. వైజాగ్ లో తన తోడల్లుడు భరత్ కి చెందిన గీతం యూనివర్సిటీలో ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో లోకేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇంతకీ లోకేష్ ఏమన్నారంటే..
"సీఎం జగన్.. రాక్షస ఆనందానికి అడ్డు అదుపు లేదు. సీఎం స్థానంలో ఉన్న వారికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కిక్ వస్తుంది. జగన్ రెడ్డి కి విధ్వంసం కిక్ ఇస్తుంది. సుదీర్ఘ చరిత్ర ఉన్న గీతం యూనివర్సిటీ కట్టడాల కూల్చివేత రాజకీయ కక్ష సాధింపుకి పరాకాష్ట."
"కరోనా కష్ట కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సేవలు అందించింది గీతం ఆసుపత్రి. ఎన్నో ఏళ్లుగా విద్యాబుద్ధులు నేర్పి ఎంతో మందిని ఉన్నత స్థానాలకు చేర్చిన గీతం యూనివర్సిటీ పై విధ్వంసం జగన్ రెడ్డి నీచ స్థితికి అద్దం పడుతోంది. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా యుద్ధవాతావరణం సృష్టించారు"
"మొన్న సబ్బం హరి ఇల్లు, నేడు గీతం యూనివర్సిటీ. పడగొట్టడమే తప్ప నిలబెట్టడం తెలియని వ్యక్తి జగన్ రెడ్డి. విశాఖ లో విధ్వంసం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచెయ్యడమే జగన్ రెడ్డి లక్ష్యం."

ఇలా సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు లోకేష్. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కిక్ వస్తుందని, కానీ జగన్ కి విధ్వంసం కిక్ ఇస్తోందని మండిపడ్డారు. ఇటీవల వరద బాధితుల పరామర్శకు వెళ్లిన సమయంలో కూడా జగన్ ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు లోకేష్. రాష్ట్రంలో రైతుల్ని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. పొలాల్లో మోటార్లకు కరెంటు మీటర్లు బిగిస్తే ఉద్యమం లేవదీస్తానంటూ హెచ్చరించారు. మొత్తమ్మీద చాన్నాళ్లుగా ట్విట్టర్ కే పరిమితమైన లోకేష్.. ఇప్పుడు జనాల్లోకి వస్తూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ట్వీట్ల ద్వారానే కాదు, నేరుగా కూడా మాటకు మాట సమాధానం చెప్పగలను అని నిరూపించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: