రాజకీయాలకు ఎప్పటికపుడు కొత్త విషయాలు కావాలి. జనాలకు కూడా పాతవి చెబితే అట్రాక్ట్ కారు. పైగా ఏదో చేస్తామని చెప్పే మాటలు అసలు పట్టించుకోరు. అందువల్ల సరికొత్త విషయాలతో ఏ ఎన్నికకు ఆ ఎన్నికగా రావడం నయా పొలిటికల్ ట్రెండ్. ఇదిలా ఉంటే బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్ లో కాలూనడం చాలా ముఖ్యం. ఇపుడున్న పరిస్థితుల్లో దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాన్ని కంటిన్యూ చేయడం ఇంకా ముఖ్యం.

లేకపోతే అది గాలివాటం గెలుపు అంటారు. అంతే కాదు, దాన్ని కాస్తా  తీసుకెళ్ళి దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే  రఘునందనరావు ఖాతాలో వేస్తారు. మరి బీజేపీకి తెలంగాణాలో ఊపు లేదు అని కూడా డిసైడ్ చేస్తారు. దాంతోనే బీజేపీ ఆగమాగం అవుతోంది. తెలంగాణాలో తన వాటా ఏంటో తేల్చుకోవాలన్నా, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపించాలన్నా కూడా బీజేపీకి భాగ్యనగరం బోలెడు వరాలు ఇవ్వాల్సిందే.

ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీయారెస్ విజయం నల్లేరు మీద నడక అని అంటారు. ఆ పార్టీకి పట్టుమని యాభై కార్పోరేటర్లు వస్తే చాలు మేయర్ వారిదే. ఎందుకంటే మరో యాభై మంది దాకా ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఉన్నారు. ఇక గ్రేటర్ వ్యాప్తంగా క్యాడర్ కూడా బాగానే ఉంది. లీడర్లు దండీగా ఉన్నారు.

దాంతో బీజేపీ ఇపుడు పాత బస్తీ మీద గురి పెట్టిందని అంటున్నారు. అక్కడ మజ్లీస్ ప్రాబల్యం ఉంది. ఎపుడూ ఆ పార్టీనే మొత్తం డివిజన్లు గెలుస్తుంది. అక్కడ సున్నితమైన అంశాల మీద ప్రచారం చేస్తే ప్రజల‌లో రియాక్షన్ వస్తుంది. అది మిగిలిన ప్రాంతాల మీద కూడా ప్రభావం పడుతుంది. అందుకే బీజేపీ తెలంగాణా ప్రెసిడెంట్ బండి సంజయ్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్ళి పూజలు చేశారు. అసలు హైదరాబాద్ కి పూర్వాశ్రమంలో భాగ్యనగరం అని పేరు కూడా ఉంది. సో ఆ సెంటిమెంట్ తో కొట్టాలనుకుంటున్నారు మరి పాత బస్తీలో కొత్త కుస్తీ కమలానికి ఓట్ల పంట పండిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: