కరోనా ఉదృతి రాష్టంలో కొనసాగుతోందని...ఆ కారణంగా
అసెంబ్లీ సమావేశాల రోజులు కూడా తగ్గించమంటూ
ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అదే కరోనాని సాకుగా చూపించి
స్థానిక ఎన్నికలను కూడా నిర్వహించలేమంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రయత్నాలకు అడుగడుగునా అడ్డు తగులుతోంది. అదే సమయంలో విపక్షాల నిరసనలు, ధర్నాలు, ఆందోళనలను అణచివేసేందుకు కరోనా ఆంక్షలను తెరపైకి తెస్తోంది. అంతేనా? అధికార పక్షం నేతలు గుంపులు గుంపులుగా కార్యక్రమాలు చేస్తున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తోంది.
కరోనా గురించి ఇంతగా చెబుతున్న
ఏపీ సర్కార్ కరోనా తీవ్రత ఉండగానే మద్యం దుకాణాలను బార్లా తెరిచే అవకాశాన్నిచ్చింది. పాఠశాలలు తెరచింది. అందువల్ల రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడి ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్షాలు తప్పుపట్టే స్థాయి వరకూ వెళ్ళింది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం
ఏపీఅసెంబ్లీ లో కరోనా కలకలం సృష్టించింది. తణుకు
ఎమ్మెల్యే కాకునూరు నాగేశ్వరరావు కి కరోనా పాజిటివ్ అని తేలడంతో మిగిలిన ఎమ్మెల్యేలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ప్రజా ప్రతినిధులు సభలో 70 సంవత్సరాలకు పైబడిన వారు కూడా ఉన్నారని, అందుకే సమావేశాలను అయిదు రోజులకు కుదించామని ప్రభుత్వం ప్రకటించింది. అయిదోరోజులకు కుదించిన
అసెంబ్లీ సమావేశాల్లో కాకునూరు నాగేశ్వరరావు మొదటి రెండు రోజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుదీర్ఘ ప్రసంగం చేశారు కూడా.
లేటెస్ట్ గా కరోనా పాజిటివ్ అని తేలడంతో మూడోరోజు సమావేశానికి ఆయన హాజరు కాలేదు. కాగా, మొదటి రెండు రోజులూ కాకునూరు నాగేశ్వరరావు కి సన్నిహితంగా మెలిగిన ఎమ్మెల్యేలు భయాందోళనలో ఉన్నారు. వారిలో కొంతమంది అసెంబ్లీకి డుమ్మా కొట్టారు. వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.
దేవాదాయ శాఖా
మంత్రి వెల్లంపల్లి కూడా గతంలో కరోనా బారిన పడి ఇటు
హైదరాబాద్ వచ్చి చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
మరో రెండు రోజులు
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున సభ్యులు కలవరపడుతున్నట్లు తెలుస్తోంది.