టీఆర్ఎస్ కు 35.81 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 35.56 శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలకు పోలయిన ఓట్ల శాతంలో తేడా కేవలం 0.25 శాతం మాత్రమే. విచిత్రంగా ఎంఐఎం పార్టీ కేవలం 18.76 శాతం ఓట్లతో 44 స్థానాలను గెల్చుకుంది. సీట్ల సంఖ్యలో కాస్త దూరంలోనే ఆగిపోయినా, ఓటింగ్ శాతంలో టీఆర్ఎస్ కి బాగా దగ్గరకు వచ్చేసింది బీజేపీ. దీంతో గ్రేటర్ లోనే కాదు, తెలంగాణ మొత్తంలో టీఆర్ఎస్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని అంటున్నారు కొంతమంది.
చేజారుతున్న ఉద్యమ నాయకులు..
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఆ తర్వాత పార్టీలో సముచిత స్థానం ఇచ్చారు కేసీఆర్. కానీ రాను రాను పరిస్థితులు మారిపోయాయి. ఒక్కొక్కరూ కేసీఆర్ ని విభేదించి బైటకొచ్చారు. రాజకీయ లాభంకోసమో, లేక టీఆర్ఎస్ వ్యవహారాలు నచ్చకో తెలియదు కానీ.. తెలంగాణ శాసన మండలి తొలి చైర్మన్ గా పనిచేసిన స్వామిగౌడ్ లాంటి నేతలు సైతం ఇటీవల బైటకు వచ్చేశారు. వీరంతా కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయలేదు కానీ, తమలాంటి ఉద్యమ నాయకుల్ని పార్టీ విస్మరిస్తోందనే విషయాన్ని మాత్రం కుండబద్దలు కొట్టారు. ఈ దశలో పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్న మరికొందరు ఉద్యమ నాయకులు కూడా టీఆర్ఎస్ ని వీడే అవకాశాలున్నాయి. అసంతృప్తులు ఎక్కువ కావడం కూడా పార్టీకి గ్రేటర్ ఎన్నికల్లో నష్టం చేకూర్చింది. ఇప్పటికైనా టీఆర్ఎస్ లో ఉద్యమ నాయకులకు పెద్దపీట వేసి, కేసీఆర్ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు చాలామంది. పార్టీకి పునర్వైభవం రావాలంటే.. అర్జంట్ గా ప్రక్షాళణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి