తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.  దేశ రాజధానిలో నిర్మించ తలపెట్టిన పార్టీ కార్యాలయానికి శంకుస్థాపనకే కేసీఆర్ వెళుతున్నారని చెబుతున్నా.. ఆయన షెడ్యూల్ పై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన పర్యటనలో ప్రధాని నరేంద్ర  మోడీని కేసీఆర్ కలవబోతున్నారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర సమస్యలపైనే ప్రధానితో కేసీఆర్ మాట్లాడుతారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు వివరణ ఇస్తున్నా..బీజేపీతో సయోధ్య కోసమే టీఆర్ఎస్ అధినేత హస్తినకు వెళుతున్నారనే ప్రచారం జరుగుతోంది.


       సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మణిక్కం ఠాగూర్  వేదికగా వ్యంగ్యాస్త్రం సంధించారు. ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న రైతులను కలవడానికి వెళుతున్నారా లేక  ‘ఢిల్లీ మే దోస్తీ’ కార్యక్రమంలో భాగంగా వెళుతున్నారా అని ప్రశ్నించారు. అలా అయితే రైతులకు మద్దతు కేవలం నోటి మాటేనా అని చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. సీపీఐ నేత నారాయణ కూడా కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై హాట్ కామెంట్స్ చేశారు. మోడీతో ఫ్రెండ్ షిప్ కోసమే వెళుతున్నారని ఆరోపించారు.

            కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. 16 రోజులుగా వారు ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్నారు. రైతుల ఆందోళనకు కేసీఆర్ కూడా మద్దతు ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో రైతులకు నష్టమని ఆరోపించారు. రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ లోనూ టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. రైతుల పోరాటానికి మద్దతు ఇచ్చిన కేసీఆర్.. ఢిల్లీ పర్యటనలో వారిని కలిసి మద్దతు తెలుపుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కేసీఆర్ షెడ్యూల్ లో రైతులతో సమావేశం లేకపోవడం వివాదంగా మారుతోంది. ఇదే విషయాన్ని కోడ్ చేస్తూ విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారు. బీజేపీతో దోస్తీ కోసమే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని చెబుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: