కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులోని  హైవేలపై  రైతుల ఆందోళన కొనసాగుతోంది. అన్నదాతలు చలికి వణుకుతూ... ఇళ్లు, కుటుంబాన్ని వదిలేసి చేపడుతున్న ఆందోళనలు 26వ రోజు కొనసాగాయి.

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నవంబర్‌ 26 నుండి రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. ఒక పక్క చలి తీవ్రమవుతున్నా.. సరిహద్దుల్లో ప్రమాదాలు జరుగుతున్నా.. అనారోగ్యం బారిన పడుతున్నా.. ప్రతికూల పరిస్థితులనూ  లెక్కచేయకుండా లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నారు. చలి తీవ్రతకు పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలకు కారణమైన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమం విరమించే ప్రసక్తే లేదంటున్నారు అన్నదాతలు.

ఈ రోజు నిరసన ప్రదేశాల్లో రైతులంతా రిలే నిరాహార దీక్ష చేశారు. ఈ నెల 25 నుంచి 27 వరకు హర్యానాలో టోల్రుసుము వసూలును అడ్డుకోనున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో రైతు చట్టాలకు మద్దతును ఉపసంహరించుకోవాలని బీజేపీ భాగస్వాములకు లేఖలు పంపనున్నారు. అలాగే ఇతర దేశాల్లోని రాయబార కార్యాలయాలకు భారతీయులు వెళ్లి, ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరాలంటూ విజ్ఞప్తి చేస్తారు. ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడినంత సేపు ప్రజలంతా పళ్లాలు మోగించాలని అభ్యర్థించారు.

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఆందోళన చేస్తున్న రైతుల పక్షాన దేశ ప్రజలంతా అండగా నిలుస్తారన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. రైతులు చేస్తున్న పోరాటానికి అండగా ఉన్న వ్యాపారులపై కేంద్ర ప్రభుత్వం ఐటీ దాడులు చేయిస్తుందని ఆయన ఆరోపించారు. పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ కూడా  కేంద్రంపై విరుచుకపడ్డారు. అన్నదాతల ఆందోళన ఉధృతికి కేంద్రానిదే బాధ్యత అని.. రైతులు మరణిస్తున్నా కేంద్రానికి ఏ మాత్రం పట్టడంలేదన్నారు. మరోవైపు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తోమర్ ను కలిసి అన్నదాతల నిరసన నేపథ్యంలో వారితో మళ్లీ చర్చలు జరపాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: