సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఒకవైపు పెట్రో మంట, మరోవైపు వంట గ్యాస్‌ ధర పెంపుతో సామాన్య ప్రజలకు...ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. తాజాగా రాయితీ సిలిండర్ ధరను పెంచుతూ.. చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.

నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం... సిలిండర్‌ ధరలను పెంచేసింది. నెలల రోజుల వ్యవధిలోనే ప్రజలపై వందల రూపాయల భారాన్ని మోపింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో...రేట్లు పెంచాల్సి వస్తోందని సర్కార్‌ చెబుతోంది. సిలిండర్‌ బుక్‌ చేసుకున్న వ్యక్తి...ధర మొత్తం చెల్లిస్తే...సబ్సిడీ సొమ్ము తిరిగి బ్యాంకు ఖాతాలో పడేది. ప్రస్తుతం సబ్సిడీ నగదు కూడా జమ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

చమురు సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎల్‌పీజీ సిలిండర్ ధర తాజాగా 25 రూపాయలు పెరిగింది. సబ్సిడీ సిలిండర్ ధరలు అమాంతం పెరిగాయి. దీంతో గృహ వినియోగ సిలిండరు ధర 846 రూపాయలకు చేరింది. ఈ నెలలోనే 100 రూపాయల మేర పెరిగింది. రాయితీ కింద ఇచ్చే సిలిండర్లను త్వరలో ఎత్తివేసే అవకాశం ఉన్నట్లు చమురు సంస్థలు చెబుతున్నాయి. ఇది అమలైతే వినియోగదారులపై భారం పడనుంది. సిలిండర్‌ బుక్‌ చేసుకున్న తేదీతో సంబంధం లేకుండా డెలివరీ చేసిన రోజునే ప్రాతిపదికగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతి రోజు వేల సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఇప్పుడు పెంచిన ధరల ప్రకారం పెరిగిన 25 రూపాయలు అదనపు భారం పడింది. ఈ లెక్కన కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రజలపై మోపారు. ప్రస్తుతం సిలిండర్‌ ధర...846 రూపాయలుగా ఉంది. ఈ నెలలో పెంచిన ధరల ప్రకారం చెల్లిస్తే సబ్సిడీ మొత్తం తిరిగి వినియోగదారుల బ్యాంకు ఖాతాలకు జమకావాలి. ఇప్పటి వరకు ఈ మొత్తం సొమ్ము జమ కావడం లేదు. అసలు సబ్సిడీ మినహాయించి గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంతో కూడా తెలియడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇలా ధరలు పెంచుకుంటూ పోతే...సిలిండర్‌ ఏ విధంగా కొనుగోలు చేయాలని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: