ఏపీలో 4 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఓవైపు ఎన్నికల కమిషన్, పోలీసులు చెబుతున్నా.. ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఎన్నికల ప్రక్రియపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో పురపోరుపై మరింత పగడ్బందీగా వ్యవహరించాలని చూస్తోంది ఎన్నికల కమిషన్. అందుకే వీడియో రికార్డింగ్ లపై ఆధారపడుతోంది.

పురఎన్నికల ప్రక్రియలో భాగంగా.. జిల్లా ఖజానా, ఉప ఖజానా కార్యాలయాల్లో ఇదివరకు భద్రపరిచిన నామినేషన్‌ పత్రాలు, పోలింగ్‌ సామగ్రిని తగిన పోలీసు బందోబస్తు మధ్య బయటకు తీయించాలని అధికారులకు సూచించింది ఎన్నికల కమిషన్. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయించాలని పేర్కొంది. 75 పురపాలక, నగర పంచాయతీ, 12 నగరపాలక సంస్థల్లో వచ్చే నెల 2 నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం అవుతోంది. దీనికి ముందస్తు ఏర్పాట్లపై పుర కమిషనర్లకు పురపాలకశాఖ పలు సూచనలు చేసింది.

కరోనా కారణంగా గతేడాది మార్చిలో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా వేసిన సమయంలో అప్పటికే దాఖలైన నామినేషన్లు, సంబంధిత పత్రాలు, ఇతర సామగ్రిని జిల్లా ట్రెజరీ, సబ్‌ ట్రెజరీ కార్యాలయాల్లో భద్రపరిచారు. ఎన్నికల సంఘం ఈ నెల 15న తాజా ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేయడంతో.. భద్రపరిచిన పోలింగ్‌ సామగ్రిని బయటకు తీస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన వెంటనే బరిలో ఉన్న అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తులతో బ్యాలెట్‌ పత్రాలు ముద్రించేందుకు స్థానికంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటు ముద్ర వేసేందుకు 40 వేల కొత్త ఇంకు బాటిళ్లు తెప్పిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 9,307 పోలింగు కేంద్రాలను మున్సిపల్ ఎన్నికలకోసం సిద్ధం చేశారు. వీటిలో 109 చోట్ల మార్పులు అవసరమని కమిషనర్లు ప్రతిపాదించారు. గతంలో 666 మంది ఎన్నికల అధికారులు, 670 మంది అదనపు, సహాయ ఎన్నికల అధికారులను నియమించారు. వీరిలో 12 శాతం మంది బదిలీ, పదవీవిరమణ కారణాలతో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియకు అందుబాటులో లేరు. దీంతో వారి స్థానంలో అదే హోదా గల అధికారులను నియమించబోతున్నారు. మరోవైపు ప్రతి జిల్లాకు సమన్వయ అధికారులను సైతం ఎన్నికల కమిషన్ నియమించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: