తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలో ఉన్న‌ప్పుడు కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం డిమాండ్ చేస్తూ జ‌రిగిన ఆందోళ ఉద్రిక్తంగా మారిన సంగ‌తి తెలిసిందే. తునిలో ర‌త్నాచ‌ల్ ఎక్స్ ప్రెస్ ద‌హ‌నానికి కూడా ఈ ఆందోళ‌న కార‌ణ‌మైంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తుని సంఘ‌ట‌న‌కు సంబంధించిన కేసుల్ని ఎత్తేసింది. ముగిసిపోయింద‌ని అంద‌రూ అనుకుంటున్న త‌రుణంలో విజ‌య‌వాడ‌ రైల్వే కోర్టులో కేసులు అలాగే ఉండటంతో తాజాగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర నిందితులకూ సమన్లు జారీ అయ్యాయి. కేసుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చినా రైల్వే కేసులు ఎంత క‌ఠినంగా ఉంటాయో అవ‌గాహ‌న లేక‌పోవ‌డంవ‌ల్ల వీరికి భ‌విష్య‌త్తులో కూడా ఈ కేసుల నుంచి విముక్తి ల‌భించే అవ‌కాశం క‌న‌ప‌డ‌టంలేదు.

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకోని గత టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా కాపులు ఉద్యమించారు. 2016లో తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన రైలు రోకో సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహా పలువురు కాపు ఉద్యమ నేతల పిలుపు మేరకు ఆందోళనలు జరిగాయి. ఇందులో భాగంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తుని రైల్వే స్టేషన్ సమీపంలో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టారు. రాష్ట ప్రభుత్వంతో పాటు రైల్వే చట్టం కింద పలువురిపై కేసులు నమోదయ్యాయి.

వైసీపీ ప్ర‌భుత్వం తరఫున కేసులన్నీ వెనక్కి తీసుకున్నారు. అప్పట్లో నిందితులుగా ఉన్న ముద్రగడ పద్మనాభంతో పాటు మిగతా కాపు జేఏసీ నేతలకూ ఇది ఊరటనిచ్చింది. అయితే రైల్వే కేసులు మాత్రం ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తుని దహనం ఘటనలో రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులో నిందితులకు తాజాగా సమన్లు జారీ అయ్యాయి. ముద్రగడతో పాటు 41 మందిపై రైల్వే చట్టంలోని 146, 147, 153, 174 సెక్షన్ల కింద కేసులు నమోదై ఉన్నాయి.  వీరంతా మార్చి 3న విజయవాడలోని రైల్వే కోర్టుకు హాజరుకావాలని సమన్లలో పేర్కొన్నారు. వీరిలో ముద్రగడ పద్మనాభం, మంచాల సాయిసుధాకర్‌ నాయుడుతో పాటు ప‌లువురు కాపు ఉద్య‌మ నేత‌లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: