హుజూరాబాద్ ఉపఎన్నిక...ఇప్పుడు తెలంగాణ రాజకీయాలన్నీ ఈ ఉపఎన్నిక చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ ఉప ఎన్నిక బరిలో ఎవరు గెలుస్తారని తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అసలు ఉపఎన్నిక షెడ్యూల్ రాక ముందే అక్కడ ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఇక్కడ పార్టీల కంటే వ్యక్తిగతంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్‌ల మధ్య ప్రధాన పోరు జరుగుతుందని చెప్పొచ్చు.

ఎందుకంటే హుజూరాబాద్‌లో బీజేపీకి పెద్ద బలం లేకపోగా, గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి నోటా కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. కానీ ఇప్పుడుప్పుడే తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుంది. అందుకే ఈటల బీజేపీలోకి వచ్చారని తెలుస్తోంది. కానీ హుజూరాబాద్ ఉపఎన్నికలో ఈటల తన సొంత బలాన్ని నమ్ముకుని ముందుకెళుతున్నారు. దశాబ్దాల పాటు ఈటల, హుజూరాబాద్‌లో పనిచేస్తూ వస్తున్నారు.

 
అయితే తాను ఏ పార్టీలో ఉన్న ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నారు. అలాగే ఎన్నికల షెడ్యూల్ రాకపోయిన పాదయాత్ర పేరిట హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజల్ని కలుస్తున్నారు. అటు అధికార టీఆర్ఎస్ సైతం, ఈటలకు చెక్ పెట్టేసి, హుజూరాబాద్‌లో గులాబీ జెండా ఎగరవేయాలని చూస్తోంది. ఇక ఈ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలి తమకు లబ్ది చేకూరుతుందని కాంగ్రెస్ చూస్తోంది. తమ ఓటు బ్యాంక్ అలాగే ఉందని, అదే కాంగ్రెస్‌కు బెనిఫిట్ అవుతుందని చెబుతున్నారు.

 
అయితే హుజూరాబాద్‌లో గెలుపుపై ఎవరి ధీమా వారికి ఉంది. అలాగే ఈ ఉపఎన్నికపై పలు సర్వేలు కూడా వస్తున్నాయి. ఇటీవల తీన్మార్ మల్లన్న ఓ సర్వే వివరాలు చెప్పగా, అందులో ఈటలకే గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందని చెప్పారు. అలాగే సోషల్ మీడియాలో కూడా తాజాగా ఓ సర్వే వివరాలు వైరల్ అవుతున్నాయి. అందులో కూడా ఈటలకే మొగ్గు ఉందని తెలుస్తోంది. ఏదేమైనా ఇక్కడ ఈటల, టీఆర్ఎస్‌ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని అర్ధమవుతుంది. మరి ఉపఎన్నిక జరిగితే హుజూరాబాద్ బరిలో ఎవరు సత్తా చాటుతారో చూడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: