ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు స‌రికొత్త నినాదం వినిపిస్తోంది. ఇక్క‌డి ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తిని న‌మ్మొద్దంటూ.. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున స్లోగ‌న్లు వ‌స్తున్నాయి. ఆయ‌న వైఖ‌రిని నిర‌సిస్తూ చీరాల ప్ర‌జ‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.  అదే స‌మ‌యంలో సొంత పార్టీకి చెందిన నాయ‌కులు కూడా క‌ర‌ణం వైఖ‌రిని త‌ప్పుబ‌డుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల వ‌ర‌కు టీడీపీలో ఉన్న క‌ర‌ణం.. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి గెలిచారు. ఆ త‌ర్వాత‌.. త‌న కుటుంబంపై ఉన్న కేసులు, వ్యాపారాల అభివృద్ది పేరుతో ఆయ‌న పార్టీ మారి.. పెత్త‌నం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌లు జోరుగా వినిపిస్తున్నాయి.
తాజాగా చీరాల‌ మునిసిపాలిటిలోనూ క‌రణం వ‌ర్గానిదే పెత్త‌నం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఆయ‌న త‌ర‌ఫున కేవ‌లం 18 మంది మాత్ర‌మే గెలిచారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌ వ‌ర్గం ఇండిపెండెంట్‌గా పోటీచేసి..11 కౌన్సెల‌ర్ల‌ను గెలిపించుకుని స‌త్తా చాటుకుంది. అయితే.. ఈ వ‌ర్గం ఇటీవ‌ల మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ కండువాలు క‌పుకొంది. దీంతో అంద‌రూ ఒక్క‌టేన‌ని.. అంద‌రూ వైసీపీ త‌ర‌ఫున గెలిచిన‌ట్టేన‌ని సాక్షాత్తూ మంత్రే ప్ర‌క‌టించారు. అయితే.. మంత్రి మాట‌ల‌కు కూడా విలువ లేకుండా క‌ర‌ణం వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. ఈ 11 మంది కౌన్సెల‌ర్లు గెలిచిన వార్డుల‌ను అభివృద్ధి చేసే విష‌యంలో వివ‌క్ష చూపిస్తున్నార‌ని... వారికి క‌నీసం మ‌ర్యాద కూడా ఇవ్వ‌డం లేద‌ని.. పెద్ద ఎత్తున ఆందోళ‌న వినిపిస్తోంది.
దీనికితోడు.. అస‌లు క‌ర‌ణం వైసీపీలో ఉంటూ.. టీడీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంద‌ని.. వైసీపీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్ప‌టికీ ఆయ‌న‌కు టీడీపీ నేత‌ల‌తో స‌త్సంబంధాలు కొన‌సాగుతున్నాయ‌ని.. వారితో ట‌చ్‌లో ఉంటున్నార‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో చీరాల అభివృద్దికి కూడా ఆయ‌న ఏమాత్రం శ్ర‌ద్ధ చూపించ‌డం లేద‌ని.. ఆయ‌న‌ను క‌లుసుకోవాలంటే.. వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకోవాల్సి వ‌స్తోంద‌ని.. నేత‌లు చెబుతున్నారు. ఇక బ‌ల‌రాం విష‌యంలో చీరాల ప్ర‌జలకు మ‌రీ విసుగు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం గొడ‌వ‌లు, క‌క్ష‌లు, కార్ప‌ణ్యాల‌తో కూడిన రాజ‌కీయాలే ? అని అంటున్నారు.
అస‌లు అభివృద్ధి అన్న మాట ప‌క్క‌న పెట్టేసి.. ఏ పార్టీలో ఉన్నా... ఏ నియెజ‌క‌వ‌ర్గంలో ఉన్నా వివాదాల్లోనే ముందు ఉండ‌డం శాంత‌ప‌రులు అయిన చీరాల వాళ్ల‌కు న‌చ్చ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే క‌ర‌ణం చీరాల ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి అవ‌స‌ర‌మా ? అనే వ్యాఖ్య‌లు వైసీపీ నుంచి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల నుంచి కూడా జోరుగావిని పిస్తున్నాయి. దీంతో సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. న‌మ్మొద్దు.. న‌మ్మొద్దు.. క‌ర‌ణంను న‌మ్మొద్దు అంటూ.. యువ‌త పోస్టులు పెడుతున్నారు. దీనిపై చీరాల‌లో పెద్ద చ‌ర్చే సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: