ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ .. బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్‌ ఆఫీసర్.. ఆయన క్రమంగా తన పార్టీ విస్తరణకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణలోని అనేక మంది నాయకులను కలుస్తున్నారు. ప్రజా సంఘాల నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. సైలంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే తాజాగా ఆయన కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ తన ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ ఆరోపిస్తున్నారు.


తనవే కాదు.. తెలంగాణలోని లక్షల మంది ఫోన్లను  కేసీఆర్ అనధికారికంగా ట్యాప్ చేయిస్తున్నారట. దీనికి కారణం కేసీఆర్ అభద్రతా భావమే అంటున్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్. అందుకే ప్రగతి భవన్ చుట్టూ అంత బందోబస్తు ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. లఖీంపూర్‌లో రైతుల మీద కారు తోలినా...  కేసీఆర్‌ను ఏదైనా అంటే రాజద్రోహం కేసు పెడతామని కేటీఆర్ హెచ్చరించినా.. అదంతా ప్రజల సమస్యలు అర్థం చేసుకోలేని నాయకుల తత్వమే అంటున్నారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్.


ప్రస్తుత రాజకీయాల్లో లోపం నాయకుల్లో లేదని... వారికి అధికారం వచ్చే పద్ధతిలో ఉందని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  చాలా మంది నాయకులు డబ్బు, మద్యం పంచి పవర్‌లోకి వస్తారని... అలా వచ్చిన వారు జనాన్ని గౌరవంగా చూస్తారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ వాసాలమర్రిలో రూ.3 కోట్లతో దావత్ ఇచ్చారని... బలవంతంగా బతుకమ్మ చీరలు అంటగడుతున్నారని.. ఇదంతా ఎవరి సొమ్ము అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ ప్రశ్నించారు.


మీడియా కూడా ఉన్నత వర్గాల చేతిలో ఉందని.. ఇది ఎప్పుడూ  దళిత నాయకులు, మేధావుల మీద ఆరోపణలు చేస్తూ ఉంటుందని ప్రవీణ్‌ కుమార్ విమర్శించారు.  కొంతకాలానికి జనం దానికి అలవాటు పడి అదే నిజమని నమ్ముతారన్న ప్రవీణ్‌ కుమార్.. అందుకే కాన్షీరాం లాంటి వారు సొంతంగా పత్రిక ప్రారంభించారని గుర్తు చేశారు. తనను  విమర్శించేవారు నన్ను అన్ని కోణాల్లో చూసి విమర్శిస్తే బాగుంటుందని సూచించారు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్.


మరింత సమాచారం తెలుసుకోండి: