ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ దాడులు హద్దు మీరుతున్నాయి. ఇప్పుడు ఇదే రాష్ట్ర పోలీసుల పనితీరుపై మచ్చ పడేలా చేస్తోంది. 2019లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోలీసు శాఖ వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే... డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు... డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను నియమించారు. ఆయనపై తెలుగుదేశం పార్టీ నేతలు తొలి నుంచి తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో... తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సానుభూతి పరులపై పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఓ టీడీపీ ఎమ్మెల్సీతో పాటు మాజీ ఎమ్మెల్యేపై మాచర్లలో దాడి జరిగింది. ఇక రాజధాని అమరావతిలో ఉద్యమం చేస్తున్న వారిపై కేసులు పెట్టారు. అయితే ఆ సమయంలో పోలీసు శాఖ పూర్తి ఏకపక్షంగా వ్యవహరించిందనే విమర్శలు మూట గట్టుకుంది. ఇక కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత కూడా పోలీసుల తీరు ఎన్నో విమర్శలకు దారి తీసింది.

కొవిడ్ సమయంలో వైసీపీ నేతలు భారీ ర్యాలీలు నిర్వహించిన సమయంలో పోలీసుల బందోబస్తు నిర్వహించారు. కానీ టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తాం అంటూ అర్జీ పెట్టుకుంటే మాత్రం కొవిడ్ నిబంధనలు అంటూ రూల్స్ పెట్టారు. ఇక కొంత మంది టీడీపీ నేతలపై పదేపదే వరుసగా కేసులు పెట్టడంపై కూడా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక టీడీపీ నేతలపై దాడులు జరిగిన సమయంలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపైనే తిరిగి కేసులు పెట్టారు పోలీసులు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంపైనే వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి యత్నించారంటూ ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపైనే పోలీసులు కేసులు పెట్టారు. ఇక మాజీ మంత్రి దేవినేని ఉమాపై దాడి జరిగితే... ఆయనపైనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు పోలీసులు. ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపైనే దాడి జరిగింది. ఇది పోలీసుల వైఫల్యంగా టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దాడి విషయంపై చంద్రబాబు స్వయంగా డీజీపీకి ఫోన్ చేసినా కూడా... వేరే పనిలో ఉన్నానంటూ గౌతమ్ సవాంగ్ సమాధానం ఇచ్చారని.... ఇది ఆ శాఖ పనితీరుకు నిదర్శనం అని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. దాడి విషయం ముందుగా పోలీసులు గుర్తించలేకపోయారా... లేక తెలిసినా కూడా అధికార పార్టీకి భయపడి సైలెంట్‌గా ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: