పవన్ కల్యాణ్ ని సినిమావాళ్ల తరపున వకాల్తా పుచ్చుకోవాలని ఎవరూ అడగలేదు. కానీ పవన్ గతంలో రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు వైసీపీ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. ఆ క్రమంలో మంత్రి పేర్ని నాని, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికీ తెలుసు. చివరకు టాలీవుడ్ ని ముఖ్యంగా పవన్ ని టార్గెట్ చేసుకుని ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లకు సంబంధించిన కొత్త చట్టం అమలులోకి తెచ్చిందనే ప్రచారం కూడా జరిగింది. సినిమా టికెట్ల వ్యవహారంలో కొంతమంది నిర్మాతలు ఆందోళనలో ఉన్నారు. భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలకు ఏపీలో అనుకున్నంత కలెక్షన్లు రాకపోతే తమ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ నిర్మాత కూడా ఆమధ్య నాయకులతో చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మరోసారి సినీ ఇండస్ట్రీ తరపున పవన్ కల్యాణ్ ఆవేశంగా మాట్లాడారు. తనని టార్గెట్ చేయాలని చూస్తే తన సినిమాలను ఏపీలో ఫ్రీగా చూపిస్తానంటూ సవాల్ విసిరారు.

పవన్ మాటలతో నిర్మాతల్లో భయం..
ప్రభుత్వంతో ఎవరూ తెగేదాకా లాగాలనుకోరు. అవకాశం ఉన్నంత మేర చర్చల ద్వారానే సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలనుకుంటారు. కోట్ల రూపాయల పెట్టుబడి కాబట్టి పంతానికి పోవడం నిర్మాలతకు కూడా సేఫ్ కాదు. అందుకే జగన్ సర్కారుతో సంధి చేసుకోడానికే నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. గతంలో చేసిన ప్రయత్నాలు విఫలం అయినా ఇప్పుడు మరోసారి రాయబారాలు నడుపుతున్నారు. ఏపీలో బెనిఫిట్ షో లు లేవు, ఫస్ట్ వీక్ టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేదు. ఈ రెండిటి కోసమే ఇప్పుడు నిర్మాతల ప్రయత్నాలన్నీ. ఇలాంటి సందర్భంలో పెద్ద సినిమాల రిలీజ్ లు ముందు పెట్టుకుని పవన్ మరోసారి సినిమాల విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. దీంతో ప్రభుత్వం మరింత పట్టుదలకు పోతుందేమోననేది నిర్మాతల భయం.

కొత్త నిబంధనలతో ఏపీలో మరీ పరిస్థితులు దారుణంగా ఏమీ లేవు. సినిమాకు మంచి టాక్ వస్తే, పైరసీలో చూడటానికి ప్రజలు ఇష్టపడకపోతే కచ్చితంగా కలెక్షన్లు కుమ్మేసుకోవచ్చు. కాకపోతే రెండు వారాలు ఆలస్యం అవుతుంది అంతే. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలను థియేటర్లలో చూసేందుకే జనం ఇష్టపడతారు కాబట్టి, అలాంటి సినిమాలకు ఇబ్బంది లేదు. ఓ మోస్తరు సినిమాలపై మాత్రమే టికెట్ రేట్ల దెబ్బ పడుతుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ దశలో పవన్, జగన్ ప్రభుత్వంపై వేసిన పంచ్ ల ప్రభావం భీమ్లా నాయక్ పై కూడా పడుతుందేమో చూడాలి. మిగతా సినిమాలకు నిబంధనలు సడలించి, భీమ్లా నాయక్ ని ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి సాధ్యం కాదు. ప్రభుత్వం మెట్టు దిగకపోతే అన్ని సినిమాలు, అందరు నిర్మాతలు ఇబ్బంది పడతారు. పరోక్షంగా పవన్ వ్యాఖ్యలే దీనికి మరోసారి కారణం అనే అనుమానాలు బలపడతాయి. మొత్తమ్మీద సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడిన పవన్ తొలిసారి నిర్మాతల్ని టెన్షన్ పెడితే, ఇప్పుడు రాజకీయ వేదికపై సినిమా డైలాగులు కొట్టి మరోసారి నిర్మాతల్ని ఆందోళనలోకి నెట్టేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: